తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.. కేసీఆర్ రెండోసారి అందుకు మొగ్గు చూపే వీలుంది.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ విషయాన్ని సూచించడంతో ముందస్తు ఖాయం.. ఇలా గత కొన్ని రోజులుగా సాగిన ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలో మరోసారి ముందస్తు ఎన్నికల అవసరమే లేదని స్వయంగా సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. వచ్చ ఎన్నికల్లో కచ్చితంగా టీఆర్ఎస్కే మళ్లీ ప్రజలు పట్టం కడతారనే ఆత్మవిశ్వాసాన్ని వెలిబుచ్చారు.
విజయం కోసం..
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగిందని ప్రెస్మీట్ పెట్టి బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్.. ఈ సందర్భంగానే ముందస్తు విషయంపై తేల్చేశారు. ఆ అవసరమే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 95 నుంచి 105 సీట్లు గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమకు ప్రతిపక్షమే లేదన్నారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీ 107 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని ఇప్పటికీ ఆ పార్టీకి ఉనికి లేదని కేసీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు తన దగ్గర బ్రహ్మాండమైన మంత్రం ఉందని ఆయన వెల్లడించారు. దీంతో ఆ బ్రహ్యాస్త్రం ఏమై ఉంటుందనే చర్చ మొదలైంది.
అదే అస్త్రం..
రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆయన తెలంగాణ సెంటిమెంటుతోనే విజయాలు సాధించారనే అభిప్రాయాలున్నాయి. కానీ ఈ సారి మాత్రం ఆ సెంటిమెంటును పక్కనపెట్టి మరో అస్త్రాన్ని ఎంచుకుంటారనే సంగతి తెలుస్తోంది. దీంతో అది ఏమై ఉంటుందని ప్రత్యర్థి పార్టీలు కూడా చర్చల్లో మునిగిపోయాయి. రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరున్న కేసీఆర్ ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేస్తారో అనే ఆసక్తి నెలకొంది. అయితే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని చెప్పిన ఆయన ఈ సారి బీజేపీని టార్గెట్ చేసి ఆ కారణంతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. గతేడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ అమలు చేసిన వ్యూహాన్ని ఇక్కడ తెలంగాణలో ప్రయోగించాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా సమాచారం.
టార్గెట్ బీజేపీ..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మమతా పోరుకు దిగారు. దీంతో ఆమెపై బీజేపీ వేధింపులకు పాల్పడుతుందనే విషయాన్ని ఆమె పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. జనాల్లో ఆమెకు సానుభూతి పెరిగి మూడోసారి మమతా సీఎం అయ్యారు. ఇప్పుడు తెలంగాణలోనూ కేసీఆర్ అందుకే బీజేపీని టార్గెట్ చేశారని రాజకీయ నిపుణులు అంటున్నారు. అందుకే ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలు మీద లేస్తున్నారని చెబుతున్నారు. తన మాటలతో బీజేపీ నేతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ప్రధాని మోడీతో సహా ఆ పార్టీ నేతలెవరీని వదిలి పెట్టకుండా కేసీఆర్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దీంతో కేసీఆర్ కామెంట్లకు రెచ్చిపోయి బీజేపీ హడావుడి చేయడమే టీఆర్ఎస్కు కావాలి. అందుకే ఇటీవల రాజ్భవన్లో గవర్నర్ ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకులకూ కేసీఆర్ దూరంగా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. గవర్నర్ ద్వారా బీజేపీ కవ్వింపు చర్యలకు పాల్పడితే అప్పుడు ప్రజల్లో వాళ్లపై వ్యతిరేకత తమపై సానుభూతి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారని టాక్. మరి ఈ వ్యూహాన్ని అర్థం చేసుకుని బీజేపీ తిప్పికొడుతుందేమో చూడాలి.