మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ, ఇటు తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ, సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఇక, మునుగోడులో ఎలాగైనా విజయం సాధించాలని కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన షాక్ లతో మేల్కొన్న కేసీఆర్ అలర్ట్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని గ్రహించిన కేసీఆర్ మునుగోడు నుంచి సమరశంఖాన్ని పూరించారు ఈ క్రమంలోనే దాదాపు 5వేల కార్లతో భారీ ర్యాలీగా మునుగోడుకు వెళ్లిన కేసీఆర్ అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేపు మునుగోడులో అమిత్ షా పర్యటన నేపథ్యంలో కేసీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణ ఏర్పాటై 8 ఏళ్లు గడుస్తోందని, కానీ, కృష్ణా నదిలో తమ రాష్ట్ర నీటి వాటాను ప్రధాని మోడీ తేల్చలేదని మండిపడ్డారు. తమ వాటా ఇవ్వనందుకే అమిత్ షా తెలంగాణకు వస్తున్నారా అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. బిడ్డా అమిత్ షా….మాకు సమాధానమివ్వాలి, కృష్ణాజిల్లాలో తెలంగాణ వాటా తేల్చకపోవడానికి కారణం ఏంటో చెప్పాలి అని కేసీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు.
పంద్రాగస్టున మోడీ మాట్లాడితే మైకులు పగిలిపోయాయని, ఆ మాటల్లో ఒక్కటైనా మంచి మాట ఉందా అని కేసిఆర్ ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నేతలు గాని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని, కిషన్ రెడ్డి గాని ఢిల్లీ వెళ్లి తెలంగాణకు రావాల్సిన కృష్ణా నీటి వాటాను తేగలరా అని ప్రశ్నించారు. అది వదిలేసి రేపు డోలు, బాజాలు పట్టుకొని అమిత్ షాను మునుగోడుకు తీసుకొస్తారట అంటూ ఎద్దేవా చేశారు.
గత ఎనిమిదేళ్లుగా మోడీ అధికారంలో ఉన్నారని, విమానాశ్రయాలు, రైలు, బ్యాంకులు, గ్యాస్ కంపెనీలు, రోడ్లు, ఇలా అన్నింటినీ అమ్మడం తప్ప మరేం చేశారని కేసీఆర్ మండిపడ్డారు. మరోపక్క, మోడీ దోస్తులు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారని, రైతులు వ్యవసాయం చేయలేరని వారు చెబుతున్నారని, కార్పొరేట్ వ్యవసాయం పెడతామంటూ రైతులను కూలీలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక రైతులకు రైతుబంధు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, పేదలకు పెన్షన్ ఎందుకిస్తున్నారని బీజేపీ పెద్దలు తమను ప్రశ్నించారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.