కేసీఆర్ వరుసగా రెండో రోజు కూడా కేంద్రం, రాష్ట్ర బీజేపీ నేత బండి సంజయ్ పై విరుచుకుపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన అదే జోరును సోమవారం కూడా కొనసాగించారు. ప్రధానంగా బీజేపీనే టార్గెట్ చేశారు. రేపు కూడా మీడియా సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
రేపు ఎవరిని టార్గెట్ చేస్తారో వేచి చూడాలి. ఈ రోజు బండి సంజయ్ ను ఉద్దేశించి మండిపడ్డారు. తన ఫాంహౌజ్‌ను దున్నడానికి సంజయ్ ఏమైనా ట్రాక్టర్ డ్రైవరా? అని ఎద్దేవా చేశారు. తన ఫామ్‌హౌస్‌లో అడుగు పెడితే ఆరు ముక్కలు చేస్తా అని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణకు బీజేపీ, బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని, దేశంలో ఏ వర్గం ప్రజలకు, ఏ జాతికి మీరు మేలు చేశారని నిలదీశారు.
రైతుల పక్షాన ప్రశ్నిస్తే దేశ ద్రోహులమా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. సమస్యలపై గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అంటున్నారని మండిపడ్డారు. దేశం దురాక్రమణకు గురికాకుండా చూడాలని చెబితే దేశద్రోహులని ముద్ర వేస్తారా? అని ప్రశ్నించారు.
రైతు వ్యతిరేక చట్టాలను ఎప్పుడు వెనక్కి తీసుకుంటారని ప్రశ్నించారు. దేశ ఖజానాలో తెలంగాణ సొత్తు కూడా ఉందని తెలిపారు. దేశ ఖజానా నీ అయ్య సొత్తు ఏమీ కాదని బండి సంజయ్ ను ఉద్ధేశించి మండిపడ్డారు. తాము ఎవరితోనైనా, ఎంత దాకా అయినా పోరాడతామని స్పష్టం చేశారు.
కొత్త జోనల్ విధానంతో 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ వారికేనని కేసీఆర్ ప్రకటించారు. త్వరలో 70 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నామని తెలిపారు. ఇప్పటికే లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రతి ఏడాది ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ విడుదల చేస్తామని, పారదర్శకంగా వ్యవహరిస్తామని తెలిపారు.
దళితుడిని సీఎంను చెస్తానని చెప్పి చేయలేదని అంటున్నారని, తాను మళ్లీ ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఆమోదించారని గుర్తుచేశారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయన్నారు. దళిత బంధు పథకం 100 శాతం అమలవుతుందని మరోసారి కేసీఆర్ స్పష్టం చేశారు.
హుజురాబాద్‌లో ప్రతి కుటుంబానికి దళిత బంధు ఇస్తామని, అలాగే ప్రతి నియోజకవర్గంలో 100 మందికి దళిత బంధు ఇస్తామని ప్రకటించారు. వచ్చే మార్చి నెల వరకు అమలవుతుందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని ఎవరూ కూడా దయచేసి వరి పంట వేయవద్దని రైతులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టదని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం డోలాయమాన స్థితిని సృష్టిస్తోందని ఆరోపించారు. కేంద్రమే ధాన్యాన్ని కొనాలని కోరుతూ వచ్చే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు.