తనకు నచ్చినప్పుడు ప్రగతిభవన్ కు.. కోరుకున్నంతనే ఫాంహౌస్ లో ఉండే కేసీఆర్.. కరోనా వచ్చి ఏడాదికి పైనే కావొస్తున్నా.. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కరోనా నోడల్ ఆసుపత్రిగా ఉన్న గాంధీని సందర్శించింది లేదు.
ఆ మాటకు వస్తే గాంధీలోని వైద్యులతో కానీ.. అక్కడి మౌలిక సదుపాయాలు.. వసతుల మీద ప్రత్యేకంగా రివ్యూ చేసింది లేదు. కాకుంటే.. వైద్య ఆరోగ్య మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు గాంధీని సందర్శించటం.. అక్కడి రోగులతోనూ.. వైద్యులతోనూ మాట్లాడే వారు.
ఇటీవల ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి.. ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నారు ముఖ్యమంత్రి. ఏమైందో ఏమో కానీ.. ఈ రోజున హటాత్తుగా గాంధీకి వెళ్లే ప్రోగ్రాం పెట్టుకున్నారు కేసీఆర్.
మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి కాస్త ముందుగా గాంధీకి చేరుకున్న ఆయన.. ఆసుపత్రిని పరిశీలించారు.అంతేకాదు.. కరోనా అత్యవసర వార్డును కూడా సందర్శించారు. ఐసీయూలో ఉన్న రోగులతో మాట్లాడిన కేసీఆర్.. వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం అక్కడ విధి నిర్వహణలో ఉన్న వైద్యులు.. జూనియర్ డాక్టర్లకు.. సిబ్బందికి సీఎం అభినందనలు తెలిజయేశారు. ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ వసతి.. ఔషధాల సరఫరాతో పాటు ఇతర అంశాల్ని అడిగి తెలుసుకున్నారు.
దాదాపు నలభై నిమిషాలకు పైనే గాంధీలో గడిపిన సీఎం కేసీఆర్.. అనంతరం ఫాంహౌస్ కు తిరిగి వెళ్లిపోయారు. అంచనాలకు అందని రీతిలో గాంధీని సందర్శించిన కేసీఆర్ వైనం ఇప్పుడు విస్మయానికి గురి చేయటమే కాదు.. ఆయన చేత ధైర్య వచనాలు చెప్పించుకున్న కరోనా రోగులు నిజంగా అద్రష్టవంతులుగా చెప్పక తప్పదు.