‘‘కాంగ్రెస్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆరు మాసాలు సమయంలో ఇవ్వాలని అనుకున్నాం. ఈ అర్భక ప్రభుత్వం బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పథకానికీ సరయిన ప్రణాళిక వేసుకున్నట్లు కనిపించడం లేదు. ఈ బడ్జెట్ ఎవరికీ భరోసా కల్పించేలా లేదు. మా ప్రభుత్వంలో వ్యవసాయ స్థిరీకరణ కోసం ఏడాదికి రెండు సార్లు రైతుబంధు వేశాం. ఈ ప్రభుత్వం దానిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నది. రైతుబంధు, రైతుభరోసాల ప్రస్తావననే లేదు. ఎప్పుడిస్తారని మా ఎమ్మెల్యేలు అడిగితే దానికి సమాధానం చెప్పడం లేదు. ఇది రైతు శతృప్రభుత్వం’’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద విమర్శలు చేశారు.
తొలిసారి శాసనసభ సమావేశాలకు వచ్చిన ఆయన బడ్జెట్ అనంతరం మీడియా పాయింట్ లో మాట్లాడారు. బడ్జెట్ ప్రసంగంలో డబ్బుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆర్థికమంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు. కొత్తగా ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు. మహిళా సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదు. వాళ్లకు రుణాలు మాత్రమే ఇస్తామన్నారు అని కేసీఆర్ విమర్శించారు.
ధాన్యం కొనుగోలు, విద్యుత్ సరఫరా, సాగునీళ్లు వంటి అంశాలలో రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇండస్ట్రియల్ పాలసీ అంతా వట్టి ట్రాష్. ఈస్ట్ మన్ కలర్ లో కథ చెబుతున్నారు. రైతులతో పాటు వృత్తి కార్మికులనూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వంచించింది అని కేసీఆర్ అన్నారు.
వ్యవసాయం, పారిశ్రామిక, ఐటీ, పేద వర్గాలకు సంబంధించిన వాటిపై పాలసీలు ఏవీ లేవు. ఒక పథకం గురించి గానీ, ఒక లక్ష్యం గురించి గానీ ఒక ప్రణాళిక లేదు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వ తప్పిదాలు, హామీల అమలు గురించి ప్రశ్నిస్తాం అని కేసీఆర్ తెలిపారు.