“ విపక్షాల.. అవెక్కడున్నాయ్!“ కొన్నాళ్ల కిందట తెలంగాణ సీఎంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య ఇది. అది కూడా.. నిండు అసెంబ్లీలోనే అన్నారు. కానీ, అవే విపక్షాలు.. చలిచీమల్లా.. ఆయనను కొరికిపడేశాయి. కట్ చేస్తే.. ఏపీలోనూ అదే తరహా రాజకీయాలు వస్తున్నాయి. `విపక్షాలు లేవు. ఉన్నది ఒక్కటే అది కూడా వైసీపీనే“ అంటూ.. అధికార పార్టీ వైసీపీ నాయకులు తరచుగా చెబుతున్నారు. ఇక, సీఎం జగన్‌కూడా విపక్షాల ఊసే మరిచిపోయినట్టు వ్యవహరిస్తున్నారు.
తమదే అధికారమని.. తామే వస్తామని ఆయన అంటున్నారు. కానీ, చాపకింద నీరులా.. బలమైన ప్రజా మద్దతును కూడగడుతున్న ప్రతిపక్షాలను అంచనా వేయడంలో వెనుకబడుతుండడమే కాకుండా.. ఎదరు దాడులు చేస్తున్నారు. ఇది .. రాజకీయంగా.. వైసీపీకి ఇప్పటికిప్పుడు బాగానే ఉండి ఉండొచ్చు. కానీ, తెలంగాణలో వచ్చిన ఫలితం.. చూస్తే.. దిమ్మతిరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ క్లీన్ స్వీప్ చేసి ఉండకపోవచ్చు. కానీ, అధికారంలోకి వచ్చేసింది.
ఇదే ఫలితం ఏపీలోనూ రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. ప్రతిపక్షాల వ్యూహాలకు ప్రతివ్యూహాలు వేయడం తప్పుకాదు కానీ.. అసలు ప్రతిపక్షమే లేకుండా పోవాలని కోరుకోవడం.. లేనట్టేనటించడం.. వంటివి తెలంగాణలో అధికార పార్టీని తుత్తునియలు చేసిన విధానం.. వైసీపీకిమెరుగైన పాఠమే అవుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. విపక్ష నేతలపై తెలంగాణలో అనేక కేసులు పెట్టారు. ఫలితంగా నాయకులు కొన్నాళ్లు ఇబ్బందులు పడ్డారు.
అయితే.. ప్రజల్లో సానుభూతి పెరిగిపోయింది. ఈ సానుభూతి ఓట్లరూపంలో పడడంతోనే.. గత నలభై ఏళ్లుగా గెలవని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పుంజుకుంది. అధికారంలోకి వచ్చింది. ఏమీ లేదని అనుకున్న స్థాయి నుంచి అధికారం దక్కించుకునే పరిస్థితికిచేరిపోయింది. గత 2018లో కేవలం 19 స్థానాల్లో గెలిచిన పార్టీ ఇప్పుడు 64 స్థానాలు దక్కించుకుంది. ఇదే సీన్ ఏపీలోనూ రిపీట్ అయితే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 23 నుంచి 123 ఎదిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.