రాజకీయాల్లో నెట్టుకు రావాలంటే.. అధికారంలో కొనసాగాలంటే పార్టీలు ముఖ్యంగా రెండు విషయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఒకటేమో సొంత పార్టీని బలోపేతం చేసుకోవడం. రెండోది.. ప్రత్యర్థి పార్టీని బలహీనపర్చడం. ఈ రెండూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కొట్టిన పిండే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014 ఎన్నికల్లో పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఇదే పని చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో తనకు పోటీనే లేకుండా.. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేలా వ్యూహాలు రచిస్తున్నారన్నది మాత్రం స్పష్టమవుతోంది.
తెలంగాణలో బీఆర్ఎస్కు పోటీనిచ్చే పార్టీ లేకుండా చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. 2014 నుంచి ఆయన ఇదే పంథాలో సాగుతున్నారు. అప్పుడు తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ నామమాత్ర పార్టీగా మారిపోయింది. అప్పుడే కాంగ్రెస్ నుంచి కొంతమంది కీలక నేతలను కేసీఆర్ లాగేసుకున్నారు. హస్తం పార్టీని బలహీనపర్చేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కొంతమంది గాలం వేసి కారెక్కించారు.
ఇప్పుడు వరుసగా మూడో సారి తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్.. మరోసారి తన రాజకీయ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషణ్రెడ్డి వచ్చేలా చేయడం వెనుక కేసీఆర్ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాష్ట్రంలో తనకు ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ మారుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నేతలను బీఆర్ఎస్లోకి చేర్చుకుని కాంగ్రెస్ను దెబ్బ కొట్టాలని కేసీఆర్ చూస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అనిల్ గురువు, కాంగ్రెస్లో అత్యంత కీలక నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అందుకే తన భార్యతో కలిసి ఉత్తమ్ బీఆర్ఎస్లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేసీఆర్ గాలానికి చిక్కి ఉత్తమ్ పార్టీ వీడితే రాష్ట్రంలో కాంగ్రెస్కు గట్టి దెబ్బ పడే అవకాశముంది.