కేసీఆర్ మెడకు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బిగుసుకుంటోందా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లుగా వినిపిస్తున్న ఆరోపణలపై విచారణకు సిద్ధంగా ఉన్నట్లు సీబీఐ కోర్టుకు స్పష్టంగా చెప్పింది. కోర్టు ఆదేశించినా లేదా ప్రభుత్వం అడిగినా వెంటనే విచారణకు రంగంలోకి దిగుతామని సీబీఐ డైరెక్టర్ తరపున ఎస్పీ కల్యాణ చక్రవర్తి కోర్టులో అఫిడవిట్ దాఖలుచేశారు. దాంతో తెలంగాణా రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఈ అఫిడవిట్ పై వచ్చేనెల 2వ తేదీన కోర్టు విచారణ జరపబోతోంది.
కేసీయార్ అధికారంలో ఉన్నప్పటినుండే కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలున్నాయి. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఆరోపణలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మంత్రులు జరుపుతున్న సమీక్షల్లో కేసీయార్ హయాంలో జరిగిన అవినీతి కళ్ళకు కట్టినట్లు కనబడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేకసార్లు చెప్పారు. వేలకోట్ల రూపాయలు దోచుకోవటానికే కేసీయార్ కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసినట్లు ఉత్తమ్ పదేపదే ఆరోపిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి బాధ్యులను ఎవరో గుర్తించి అందరినీ శిక్షించాల్సిందే అని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేయించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానిపై విచారించిన హైకోర్టు ఇటు ప్రభుత్వానికి అటు సీబీఐకి సమాధానం చెప్పమని నోటీసులు జారీచేసింది. వచ్చేనెల 2వ తేదీలోగా ప్రభుత్వం, సీబీఐ సమాధానాలు చెప్పాలి. అయితే సీబీఐ వెంటనే ఓకే చెప్పేసింది. ఇక సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే.
ప్రస్తుత పరిస్ధితుల్లో సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వం కూడా ఓకే చెబుతుందనే అనుకుంటున్నారు. సమాధానం సందర్భంగా సీబీఐ దాఖలుచేసిన అఫిడవిట్లో ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని అర్ధమొచ్చేట్లుగానే చెప్పింది. తాము లోతుగా విచారణ జరపాలంటే తమకు అడిషినల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు, సబార్డినేట్ స్టాఫ్, ఆపీసు స్టాఫ్ అవసరమని సీబీఐ తన అఫిడవిట్లో కోర్టుకు చెప్పింది. అంటే విచారణ జరపటానికి సీబీఐ సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. విచారణంటు మొదలైతే కేసీయార్ మెడకు కాళేశ్వరం అవినీతి బిగుసుకునేట్లే కనబడుతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.