హుజురాబాద్ లో ఓటమి తర్వాత బీజేపీపై సీఎం కేసీఆర్ వార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ గత శుక్రవారం నుంచి పలు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే రేపు ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించేందుక సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలోనే ఆ మహా ధర్నాపై కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఆ ధర్నాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణకు అన్యాయం జరిగిందని బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే నిరసన వ్యక్తం చేశామని హరీశ్ అన్నారు. పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసే కేంద్రం…తెలంగాణలో ఎందుకు చేయదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటోందని హరీశ్ రావు అన్నారు.
కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాలని అన్నారు. టీఆర్ఎస్ ఎల్లప్పుడు రైతుల పక్షపాతి అని, రైతులకు న్యాయం చేయడం కోసమే ఈ ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. మరోవైపు, ఉదయం 11 గంటలకు ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నా చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ మహా ధర్నాలో సీఎం కేసీఆర్ తోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు పాల్గొనబోతున్నారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్ల పై ఎఫ్సీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2020- 21 ఎండాకాలం సీజన్ లో సేకరించకుండా మిగిలి ఉంచిన 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమనే నిబంధనను పెంచాలని, పంజాబ్ మాదిరి తెలంగాణలో కూడా 2021 -22 వానాకాలంలో పండిన పంటలో 90 శాతం వరి ధాన్యాన్ని సేకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే యాసంగిలో ఎంత వరిధాన్యం కొంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.