ప్రముఖ రచయిత్రి గౌరీ లంకేశ్ హత్య తర్వాత బీజేపీపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. తాను హిందువులకు వ్యతిరేకం కాదన్న ప్రకాష్ రాజ్…ప్రధాని మోదీ, అమిత్ షాలకు మాత్రమే వ్యతిరేకమని అంటుంటారు. బీజేపీ నేతలపై, మోడీ ప్రభుత్వంపై జస్ట్ ఆస్కింగ్ పేరుతో ట్విట్టర్ లో ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ప్రకాష్ రాజ్ ను రాజ్యసభకు పంపాలని గులాబీ బాస్ ఫిక్స్ అయ్యారని గట్టిగా ప్రచారం జరుగుతోంది.
కొంతకాలంగా బీజేపీపై, ప్రధాని మోదీపై కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం కోసం కేసీఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే గులాబీ బాస్ కు దీదీ, దేవెగౌడ, ఉద్ధవ్ థాకరే వంటి నేతల మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ వ్యతిరేకి అయిన ప్రకాష్ రాజ్ ను కేసీఆర్ రాజ్యసభకు పంపాలని ఫిక్స్ అయ్యారట. సీఎం ఉద్ధవ్ థాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్‌తో కేసీఆర్ భేటీ సమయంలో కేసీఆర్ వెంట ప్రకాష్ రాజ్ కూడా ఉండటం ఆ పుకార్లకు ఊతమిస్తోంది.
ఇటీవలే రాజ్యసభ సభ్యుడు బండి ప్రకాష్ తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయ్యారు. దాంతోపాటు జూన్‌లో టీఆర్ఎస్ తరఫున పెద్దల సభకు వెళ్లిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు, శ్రీనివాస్‌ల పదవీ కాలం ముగియనుంది. దీంతో, ఈ 3 ఖాళీలలో ఒకటి ప్రకాష్ రాజ్ కు ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నారట. ఢిల్లీ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ మాట్లాడగలరని, టీఆర్ఎస్ తరఫున ఢిల్లీ రాజకీయాల్లో ఈ విలక్షణ నటుడు చక్రం తిప్పగలరన్న నమ్మకంతో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు, బీజేపీకి వ్యతిరేకంగా దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలను ఏకంచేసే బాధ్యతలు కూడా ప్రకాష్ రాజ్‌కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.