టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. దేశానికి కావాల్సింది నేషనల్ ఫ్రంట్ కాదని.. ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా అని చెబుతున్న కేసీఆర్…ఇప్పటికే బీజేపీ వ్యతిరేక సీఎంలతో భేటీ అయ్యారు. రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా జాతీయ పార్టీ పెట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగానే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన పార్టీ పేరేమిటో కూడా పరోక్షంగా చెప్పేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితి రావాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు కొద్దిరోజులుగా దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఒక్కటి కావాలని వామపక్ష నాయకులు అన్నారని, కానీ, దేశ ప్రజలను ఒక్కటి చేయాలని వారితో తాను చెప్పినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జాతీయ పార్టీపై కేసీఆర్ మరింత దూకుడుగా వ్యవహరించబోతున్నట్లుగా కొద్ది రోజుల క్రితం కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి సంకేతాలిచ్చారు.
ఈ నెల 11న కేసీఆర్ తో సుమారు రెండు గంటలకు పైగా భేటీ అయిన కుమార స్వామి ఆసక్తికర ట్వీట్ చేశారు. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల లోపుగానే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని కుమారస్వామి చెప్పారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 5న దసరా రోజున జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. అదే రోజు టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్…ఈ భేటీలో జాతీయ పార్టీ విషయమై పార్టీ నేతలతో చర్చించబోతున్నారట.
అంతేకాదు, ఫామ్ హౌస్ వేదికగా కొద్ది రోజులుగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారట. పార్టీలోని కీలక నేతలతో జాతీయ పార్టీ జెండా, ఎజెండాపై కేసీఆర్ జరిపిన చర్చలు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే, దసరానాడు జాతీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.