రెండు రోజుల క్రితం జరిగిన జనరల్ బాడీ మీటింగులో 45 మంది ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడుతున్నట్లు స్వయంగా కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాని ఆధారంగా వీళ్ళకు మళ్ళీ టికెట్లు ఇవ్వకూడదని కేసీయార్ డిసైడ్ అయినట్లు ప్రచారం పెరిగిపోయింది. అయితే తాజాగా పార్టీ వర్గ సమాచారం ప్రకారం 35 మంది సిట్టింగులకు టికెట్లు రాదట. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఓపెన్ క్యాటగిరి ఎంఎల్ఏలు కూడా ఉన్నారని సమాచారం.
ప్రస్తుతం బీఆర్ఎస్ నుండి ఎస్సీ, ఎస్టీల నుండి 28 మంది ఎంఎల్ఏలున్నారు. వీరిలో 10 మంది ఎస్టీలైతే 18 మంది ఎస్సీలు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన పై సామాజికవర్గాల వాళ్ళని ఎక్కువమందిని మార్చబోతున్నారట. ఎందుకంటే వీళ్ళపై అనేక ఆరోపణలున్నాయట. అలాగే 10 మంది బీసీ ఎంఎల్ఏలకు కూడా టికెట్లు దక్కేది డౌటనే చెబుతున్నారు. వీరిలో కొందరిపై అవినీతి ఆరోపణలుంటే మరికొందరు అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఇక వెలమ సామాజికవర్గం నుండి 10 మంది ఎంఎల్ఏలున్నారు. వీరిలో కనీసం ముగ్గురికి టికెట్లు దక్కవనే టాక్ పెరిగిపోతోంది. అత్యధికంగా ఉన్న 36 మంది రెడ్డి సామాజికవర్గం ఎంఎల్ఏల్లో 10 మందికి కోత తప్పదని వినిపిస్తోంది. వీళ్ళలో ఎక్కువమందిపై అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి. టికెట్లు దక్కని ఈ ఎంఎల్ఏల్లో ఎక్కువమంది వరంగల్, కేసీయార్ సొంతజిల్లాలోనే ఉన్నారట. టికెట్లు ఇవ్వకూడదని కేసీయార్ ఫైనల్ అయిన ఎంఎల్ఏల పేర్లు ఇపుడే ప్రకటిస్తే సమస్యలు వస్తాయని భయపడుతున్నారట.
ఇపుడే టికెట్లు ఇచ్చేదిలేదని ప్రకటిస్తే వాళ్ళల్లో అత్యధికులు బీజేపీలో లేదా కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయన్నది అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ లో నేతలు ఓవర్ ఫ్లో అవుతుంటే బీజేపీ నేతల కొరతతో అవస్తలు పడుతోంది. చాలా నియోజకవర్గాల్లో కమలంపార్టీకి గట్టి అభ్యర్ధులు లేరన్న విషయం తెలిసిందే. కాబట్టి చేతులారా బీజేపీని ఇప్పటినుండే బలోపేతం చేయటం కేసీయార్ కు ఇష్టంలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అయితే ఎవరికి టికెట్లు వస్తుంది ఎవరికి రాదనే విషయం సదరు ఎంఎల్ఏలకు బాగా తెలుసు. కాబట్టి కొంతకాలమైన తర్వాత టికెట్లు రాదని ఖాయంచేసుకున్న ఎంఎల్ఏలు తమంతట తామే ఇతర పార్టీల్లో ఖాయం చేసుకుని మారిపోతే అప్పుడు కేసీయార్ ఏమిచేస్తారు?