కేంద్రంపై తగ్గేదేలే.. అంటూ.. కేసీఆర్ తన గళాన్ని సవరించుకున్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తాను ఎట్టి పరిస్థితులలోనూ వెనక్కి తగ్గేదేలేదు. కేంద్రం కళ్లు తెరిపించడానికే యుద్ధానికి శ్రీకారం చుట్టామని కేసీఆర్ ఉద్ఘాటించారు. రైతులపై కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని తెలిపారు. దేశాన్ని పాలిస్తున్న నాయకులు రకరకాల వితండవాదాలు చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం, మంత్రు లు ధర్నాలు చేయడమేంటనీ బీజేపీ అంటుందన్న సీఎం కేసీఆర్.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పు డు మోడీ కూడా దీక్ష చేశారని గుర్తుచేశారు. దేశంలో సీఎం, మంత్రులు కూడా ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు.
ఈ పోరాటం ఇక్కడితో ఆగదని… అవసరమైతే ఢిల్లీకి యాత్ర చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇంకా చాలా పోరాటా లు చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం సమస్యను పరిష్కరిస్తే ధర్నాల అవసరం ఉండదని పేర్కొన్నారు.
తెలంగాణ రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేయాలని, రైతు ప్రయోజనాలు రక్షించుకోవాలని ఈ పోరాటం మొదలుపెట్టామన్నారు.
అన్నదాతల కోసం ఎక్కడిదాకైనా వెళ్తామని, తెలంగాణ పోరాటాల గడ్డ.. విప్లవాల గడ్డ.. తనను తాను ఎలా కాపాడుకోవాలో తెలిసిన గడ్డ. పరాయి పాలకుల విష కౌగిలి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయువు పీలుస్తూ అద్భుత పథంలో ముందుకు సాగుతోందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఈ సమయంలోనే అశనిపాతంలాగా రైతులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోందని కేసీఆర్ నిప్పులు చెరిగారు. అన్ని సమస్యల్లాగే ఈ సమస్యకూ పరిష్కారం కనుగొంటామన్నారు. దానికోసం ఎక్కడిదాకైనా వెళ్తామని తేల్చిచెప్పారు. ఎవరితోనైనా పోరాడతామని స్పష్టం చేశారు.
మరి ఇవాళ ప్రధాన మంత్రి హోదాలో ఉన్న మోడీ.. ఏ రాష్ట్రంలోనూ ప్రస్తుత పరిస్థితి రాకుండా చేయాల్సింది పోయి.. పోరాటానికి దిగిన వారిపై విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. “దేశంలో నీళ్లున్నా ఇవ్వలేని చండా గాళ్లకు చరమ గీతం పాడాల్సిందే“ అని నిప్పులు చెరిగారు. సమస్యలకు పరిష్కారం.. చూపమంటే.. గోల్మాల్ ఆడుతున్నారని విమర్శించారు.
దేశంలో అగ్గిపెట్టే సమయం వచ్చిందన్నారు. మాట్లాడితే.. కేసులు పెడతామంటున్నారని.. కేసీఆర్కు భయం అంటే ఏంటో చూపిస్తామని.. అంటున్నారని.. కేసీఆర్ భయపడతాడా? అని ప్రశ్నించారు. కేసీఆర్కు భయం ఉంటే.. తెలంగాణ వచ్చేదా? అని నిలదీశారు.
కేసీఆర్ ఉద్యమాన్ని ఆపాలంటే.. మీరు నిజాయితీగా చెప్పండి.. యాసంగిలో వరి కొంటున్నారా? లేదా..? తేల్చి చెప్పాలని నిలదీశారు. ధాన్యం కొంటామంటే ఎందుకు ఈ ఉద్యమం వస్తుందని ప్రశ్నించారు. ఇది రాజకీయ సమస్య కాదని.. రైతుల జీవన్మరణ సమస్య అని.. కేసీఆర్ పేర్కొన్నారు. ధాన్యం కొనకపోతే.. రైతులు ఆత్మహత్యలు చోటు చేసుకోవా? చెట్లకు వాళ్ల శవాలు వేలాడవా? అని నిలదీశారు.
“అయ్యా ప్రధాన మంత్రిగారు.. మేం దణ్నం పెట్టి అడుగుతున్నాం. వచ్చే యాసంగిలో వరి వేయాల్నా ? వద్దా? తేల్చి చెప్పండి“ అని కేసీఆర్ అన్నారు. రెండు మూడు రోజులు వేచి చూస్తామని.. ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. దేశంలో అగ్గిపెట్టడం ఖాయమని అన్నారు. తాము పదవుల కోసమే.. కేసులకో.. భయపడేది లేదన్నారు.
రాజకీయాలు ఉంటే తర్వాత చూసుకుందాం.. అని అన్నారు. రైతుల జీవితాలతో.. ఆడుకోవద్దని తాను కోరుతున్నట్టు కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం పరిష్కారం చేయకపోతే.. ఏం చేయాలో తాము చేసుకుంటామని.. అయితే.. కేంద్రం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
దేశంలో మొత్తం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్పీలు.. ఎక్కడైనా ధర్నా చేసిన పరిస్థితి ఉందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎందుకు రోడ్డెక్కామో.. కేంద్రం ఆలోచించాలని సూచించారు. అదేసమయంలో గవర్నర్కు కూడా మొర పెట్టుకుంటామన్నారు. ఈ దేశంలో ధర్నాలు చేయడంలోను, యుద్ధం ప్రారంభిస్తే.. చివరి వరకు చేయడంలోనూ.. కేసీఆర్ను మించిన పార్ట లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.