తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది విలక్షణ శైలి. ఇప్పటివరకు తెలుగు నేల ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూసింది కానీ.. కేసీఆర్ లాంటి అధినేతను చూసింది లేదు. ఆయన ఎప్పుడు ఎవరికి సమయం ఇస్తారో? ఎప్పుడు కలుస్తారో అన్నది ఆయన సన్నిహితులు సైతం చెప్పలేరని చెబుతారు.
కేసీఆర్ కు జానీ జిగిరీ దోస్తులు సైతం ఆయన్ను నేరుగా కలిసే అవకాశం ఉండదని చెబుతారు. కొంతమందికి కొంతకాలం సీజన్ నడుస్తుందని.. మరికొందరికి కొంతకాలం అవకాశం వస్తుందని చెబుతారు.
సాధారణంగా టాలీవుడ్ సినీ పెద్దలు అనేసరికి.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఏ అధినేత అయినా సరే.. ఇట్టే టైం ఇచ్చేస్తారు. వారితో కలిసి కూర్చొని మాట్లాడతారు. అలా మాట్లాడితే మిగిలిన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య తేడా ఏముంటుంది? కరోనా మహమ్మారి.. ఆ సందర్భంగా విధించిన లాక్ డౌన్ వ్యవహారం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకసారి థియేటర్లు మూసేసి.. మళ్లీ తెరవటం.. ముక్కుతూ.. మూలుగుతూ నడుస్తున్న వాటిపై కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో.. మరోసారి థియేటర్లు క్లోజ్ చేశారు. ఈ మధ్యనే లాక్ డౌన్ ఎత్తేయటంతో పాటు.. థియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.
అయితే.. థియేటర్లు మాత్రం ఓపెన్ కాలేదు. దీనికి కారణం తెలంగాణలో థియేటర్లు ఓపెన్ అయినా.. పెద్ద మార్కెట్ అయిన ఏపీలో థియేటర్లుఓపెన్ కాకుండా ఒక్క రాష్ట్రంలో ఓపెన్ చేస్తే.. సినిమాలకు కలెక్షన్ల దెబ్బ పడుతుందని.. అందుకే తాము సినిమా థియేటర్లను ఓపెన్ చేయమని తేల్చేశారు.
ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న కష్టనష్టాలను ముఖ్యమంత్రిని కలిసి ఆయనతో మాట్లాడాలని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు భావించారు. అనుకున్నంతనే ప్రయత్నించారు. అడిగిన వెంటనే టైం ఇవ్వటానికి ఆయనేం సాదాసీదా నేత కాదు కదా. అందుకే ఆయనతో భేటీకి అవకాశం లభించలేదు.
ముఖ్యమంత్రికి బదులుగా తాజాగా తెలంగాణ రాష్ట్ర సీఎస్ ను కలిసే భాగ్యం తెలుగు సినీ పెద్దలకు దక్కింది. ఇలాంటి అనుభవం గతంలో ఎప్పుడూ దక్కలేదని చెబుతారు. తాము కోరినంతనే టైమిచ్చే ముఖ్యమంత్రుల్ని చూశామే కానీ.. ఇలా దూరం పెట్టే సీఎంను తాము చూడలేదన్న మాట సినీవర్గాలకు చెందిన ప్రముఖుడు ఒకరు తమ వ్యక్తిగత సంభాషణలో తెలపటం గమనార్హం.
ముఖ్యమంత్రి ఎటూ కలవరు. తమ సమస్యల్ని సీఎస్ కు చెప్పుకుందామని వెళ్లారు సురేశ్ బాబు..దిల్ రాజు.. కెఎల్ దామోదర్ ప్రసాద్ తదితరులు వెళ్లారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని చెప్పుకొన్నారు. ఎప్పటిలానే.. వారి సమస్యల్ని విన్న సీఎస్ సోమేశ్ కుమార్.. సినీ పరిశ్రమ చెప్పిన సమస్యల్ని సీఎం వరకు తీసుకెళతానని.. పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. సీఎంను కలవాలనుకున్న టాలీవుడ్ పెద్దలకు తాజా పరిణామంతో భారీషాక్ తగిలినట్లుగా చెప్పక తప్పదు.