ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కరోనా కాస్త తగ్గుముఖం పడుతోన్నట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత వారం రోజులుగా 300-420 కేసుల మధ్య నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,939గా ఉండడంతో ఆరోగ్య శాఖాధికారులు వ్యాక్సినేషన్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ దాదాపుగా ముగిసినట్లేనని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కంట్రోల్ లో ఉందని, అతి తక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు పెరిగిపోయాయని, జ్వరం, జలుబు రాగానే కరోనా అనే నిర్దారణకు రావద్దని సూచించారు. ఎటువంటి అనారోగ్యం అయినా తక్షణమే వైద్యులను సంప్రదించి తగిన టెస్టుల తర్వాతే రోగమేంటో నిర్దారణ చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని… ఇప్పటికే 1.65కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో 56శాతం మంది ఫస్ట్ డోస్, 34శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిందన్నారు. హైదరాబాద్ లో 100శాతం మందికి, జిహెచ్ఎంసి పరిధిలో 90శాతం మందికి కనీసం ఒక డోస్ అయినా పూర్తయిందని ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు 98.34 శాతంగా ఉందని, కరోనాతో మరణాల రేటు 0.58 శాతంగా నమోదైందని వెల్లడించారు.
మరోవైపు, తెలంగాణలో సెకండ్ వేవ్ దాదాపుగా ముగియడంతో థర్డ్ వేవ్ ను దీటుగా ఎదుర్కొనేందుకు వైద్యశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. కేసులు తక్కువయ్యాయని నిర్లక్ష్యం వహించకుండా థర్డ్ వేవ్ ముప్పును తరిమికొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే వ్యాక్సినేషన్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
వ్యాక్సిన్ తీసుకుంటేనే బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు అనుమతినిచ్చే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు, త్వరలోనే ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. కరోనా ముప్పు నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఏకైక మార్గమని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోందట. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని అవకాశాలను పరిశీలించాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని తెలుస్తోంది.