తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా అనుకుంటే చాలు.. దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. నిద్ర పోనివ్వరు. ఎంత కష్టమైనా.. ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవటానికైనా సిద్ధమవుతారు. ఒకవేళ.. టైం తనకు అనుకూలంగా లేదన్న నిర్ణయానికి వస్తే.. కొంతకాలం ఆ అంశాన్ని అస్సలు టచ్ చేయరు. ఇలాంటివేళ.. చాలామంది అనుకునేది కేసీఆర్ ఆ ఇష్యూను మర్చిపోయారని. కానీ.. తనకు తగిన టైం కోసం ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని చాలామంది అర్థం చేసుకోరు.
ఒక్కసారి తనకు పరిస్థితులు అనుకూలంగా మారినంతనే డీప్ ఫ్రీజర్ లో పెట్టిన ఇష్యూలను ప్రయారిటీ బేసిస్ లో తెర మీదకు తీసుకొచ్చి.. మధ్యలో వచ్చిన గ్యాప్ ను సైతం సర్దే ప్రయత్నం చేసే సత్తా ఆయన సొంతం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. రాష్ట్ర పాలనకు గుండెకాయ లాంటి సచివాలయానికి నాలుగైదు సార్లు వెళ్లిన వెంటనే.. ఆయనకు ఏదో అనిపించటం.. సచివాలయానికి వెళ్లటం మానేయటం తెలిసిందే. సచివాలయాన్ని సమూలంగా నేలమట్టం చేసేసి.. తాను అనుకున్నట్లుగా నిర్మించాలని భావించారు.అంత పెద్ద కేసీఆర్ అనుకున్నప్పటికా పరిస్థితులు అనుకూలించలేదు.
దీంతో.. ఆరేళ్ల పాటు వెయిట్ చేసిన ఆయన.. ఈ మధ్యన సచివాలయాన్ని రాత్రికి రాత్రి కూల్చివేయటమే కాదు.. మొత్తాన్ని నేలమట్టం చేసేశారు. డిజైన్లు సిద్ధం చేయటం.. డిజైన్లు తెప్పించి.. మార్పులు చేర్పులతో ఫైనల్ చేశారు. కేసీఆర్ కలల ప్రాజెక్టును పూర్తి చేయటానికి చాలానే సంస్థలు బరిలోకి దిగినా.. చివరకు ఆ ప్రాజుక్టును సొంతం చేసుకున్నది మాత్రం షాపూర్జీ పల్లోంజినే. కేసీఆర్ సర్కారు చెప్పినట్లుగా పన్నెండు నెలల కాలంలో సచివాలయాన్ని సీఎం అనుకున్నట్లుగా పూర్తి చేయటానికి సై అనేసింది.
దాదాపు ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే సరికొత్త సచివాలయం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. మరి.. కేసీఆర్ కలను షాపూర్జీ పల్లోంజీ ఎంత బాగా పూర్తి చేస్తారో చూడాలి.