తెలంగాణవ్యాప్తంగా ఈ రోజు తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఊరూ వాడా…తెలంగాణ దినోత్సవాన్ని అంబరాన్నంటేలా జనం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేసి, భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఏర్పాటుకు జరిగిన కృషి, అప్పట్లో పడ్డ ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమం రెండు దశలలో జరిగిందని, తొలిదశ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు కుట్రలతో అణచివేశారని కేసీఆర్ ఆరోపించారు. దీంతో, 2001లో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చరిత్రాత్మక బాధ్యత తనకు లభించిందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాధనలో తాను కూడా పాలుపంచుకోవడంతో తన జీవితం ధన్యమైందని అన్నారు. తెలంగాణ కోసం జరిగిన మలిదశ పోరాటంలో మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు.. అన్ని వర్గాల ప్రజలు కలిసి నడిచారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణ చేసిన అమరులకు కేసీఆర్ నివాళులు అర్పించారు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు కేసీఆర్ నివాళులు అర్పించారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) చేపట్టిన కార్యక్రమాలను, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల గురించి కేసీఆర్ వివరించారు.