తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల నేతల మధ్య ఈ వెర్బల్ వార్ తారస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు.
తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ తాంత్రిక పూజలు నిర్వహిస్తుంటారని బండి సంజయ్ చేసిన షాకింగ్ ఆరోపణలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. తానేమి జోక్ చేయడం లేదని, 3 నెలలకు ఒకసారి నల్లపిల్లితో కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తుంటారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ముగ్గురు పనివాళ్ళు చనిపోయారని, ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన అప్పట్లో కలకలం రేపిందని గుర్తు చేశారు.
అయితే, ఆ యువకుడిని నరబలి ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగిందని సంచలన కామెంట్లు చేశారు. ఇక, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా పరిస్థితి చేజారిపోవడంతోనే తాంత్రికుడి సలహా ప్రకారం టీఆర్ఎస్ ను కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చారని బండి సంజయ్ షాకింగ్ కామెంట్లు చేశారు. కేసీఆర్ కు దేశంపై ప్రేమ లేదని, తన కుటుంబంపై మాత్రమే ప్రేమ ఉందని ఆయన ఆరోపించారు. పదవుల కోసం, లక్షల కోట్లు కొల్లగొట్టేందుకే దేశ రాజకీయాలంటూ కేసీఆర్ తిరుగుతున్నారని ఆరోపించారు. ఎన్ని క్షుద్ర పూజలు చేసినా కేసీఆర్ ఓటమి ఖాయమని అన్నారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ లవంగం గారిని ఇలాగే వదిలేయకండి…ఎక్కడైనా చూపించండి అంటూ బీజేపీ నేతలనుద్దేశించి కేటీఆర్ సెటైర్లు వేశారు. బండి సంజయ్ కు పిచ్చి ముదిరిందని, త్వరలోనే జనాలను ఆయన కరవడం మొదలు బెడతారేమో అని వెటకారంగా వ్యాఖ్యానించారు. మతిలేని మాటలతో సమాజానికి సంజయ్ ప్రమాదకరంగా తయారయ్యారని, ఆయన కోసం ఎర్రగడ్డలో బెడ్ రెడీ చేశామని విమర్శలు గుప్పించారు.
బండి సంజయ్ ను వెంటనే ఎర్రగడ్డకు తీసుకెళ్లి చికిత్స చేయించాలని కేటీఆర్ చురకలంటించారు. ఏదేమైనా సీఎం కేసీఆర్ పై వివాదాస్పదరీతిలో సంజయ్ చేసిన కామెంట్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలతో పాటు, జాతీయ రాజకీయాలలోనూ హాట్ టాపిక్ గా మారాయి.