టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కృష్ణ భౌతిక కాయానికి పలువురు రాజకీయ, సినీ వ్యాపార ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కృష్ణ తనయుడు, హీరో మహేష్ బాబును, మిగతా కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు.
తాను మంచి మిత్రుడిని కోల్పోయానని, కృష్ణ మన మధ్య లేకపోవడం బాధాకరమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కృష్ణ, అని గతంలో ఎంపిక కూడా పని చేశారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని చాలాసార్లు చూశానని కేసీఆర్ అన్నారు. కృష్ణగారి ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి తాను చాలా సార్లు వెళ్లానని తెలిపారు.
ఎలాంటి అరమరికలు లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కృష్ణ అని, విలక్షణమైన నటుడని కొనియాడారు.’అల్లూరి సీతారామరాజు’ గొప్ప సినిమా అని కృష్ణగారికి తాను చెపితే ఆయన నవ్వారని, కేసీఆర్ గారూ మీరు కూడా సినిమాలు చూస్తారా? అని ప్రశ్నించారని గుర్తు చేసుకున్నారు. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాను తాను చాలా సార్లు చూశానని చెపితే… ఆయన ఎంతో సంతోషించారని అన్నారు.
ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కృష్ణ గారు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు అన్న దుఃఖాన్ని భరించగలిగిన ధైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఇవ్వాలని కేసీఆర్ కోరుకున్నారు. దేశభక్తిని పెంపొందించేలా సినిమాలను తీసిన కృష్ణగారి గౌరవార్థం వారి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. కేసీఆర్ తో పాటు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కూడా కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.