రాజ్యాంగం మార్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇక, కేసీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు. బీజేపీ కుట్రకు కేసీఆర్ వంత పాడారని, రాజ్యాంగం రద్దు చేయాలన్న బిజెపి కుట్రకు కేసీఆర్ సహకరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, కేసీఆర్, ఒవైసీలు బీజేపీ సుపారీ గ్యాంగ్ అంటూ రేవంత్ షాకింగ్ కామెంట్లు చేశారు.
కేసీఆర్ ను ముందుంచి రాజ్యాంగం రద్దు అంశాన్ని బీజేపే నేతలు తెరపైకి తెచ్చారని, బీజేపీ రాజ్యాంగం రద్దు కుట్రకు కేసీఆర్ మద్దతు తెలిపారని టీపీపీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ లో మర్యాదగా వ్యవహరించలేదని మండిపడ్డారు. మోడీ పై యుద్ధం ప్రకటిస్తారని ఆశిస్తే.. నిర్మలా సీతారామన్, మోడీ గురించి నీచంగా,జుగుప్సాకరంగా కేసీఆర్ మాట్లాడారని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్ గంటన్నర ఉంటే కేసీఆర్ రెండున్నర గంటలు ఏకపాత్రాభినయం చేశారని ఎద్దేవా చేశారు. కల్తీ మందు తాగి వచ్చినట్లు కేసీఆర్ మాట్లాడారని సెటైర్లు వేశారు.
ఇక, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ సుపారీ గ్యాంగ్ అని.. యూపీలో బీజేపీని గెలిపించేందుకు వారిద్దరూ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. యూపీలో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి ఎంఐఎం పోటీ చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ సుపారీ ఇచ్చారని, ఒవైసీ షార్ప్ షూటర్ అని సంచలన ఆరోపణలు చేశారు. కాగా, గతంలో కూడా బీజేపీ వ్యతిరేక ఓట్లను ఎంఐఎం చీల్చిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.