తెలంగాణలో కొంతకాలంగా గవర్నర్ తమిళిసై వర్సెస్ సీఎం కేసీఆర్ అన్న రీతిలో మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీ వెళ్లిన తమిళిసై….కేసీఆర్ అండ్ కోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారని, డ్రగ్స్ కేసుతో పాటు కేసీఆర్ ను ఇరుకునపెట్టే పలు విషయాలు ఆయనకు వెల్లడించారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కేబినెట్ భేటీ సందర్భంగా గవర్నర్ తీరుపై మంత్రులతో కేసీఆర్ చర్చించినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.
గవర్నర్ అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేలా గవర్నర్ ప్రవర్తిస్తున్నారని కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చాలా అంశాలపై తమిళిసై వితండవాదం చేస్తున్నారని, ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది.
మరోవైపు, గవర్నర్ తమిళిసైతో టీపీసీసీ కీలక నేతలు భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీ, వి.హనుమంతరావు తదితరులు గవర్నర్ తో సమావేశమై తెలంగాణలో నిరుద్యోగం, 111 జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, డ్రగ్స్, తదితర అంశాలపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ధాన్యం మొత్తం తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ ప్రకటన చేసిన విషయంపై కూడా వారు చర్చించినట్లు తెలుస్తోంది. తక్షణమే అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని, మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేయాలని గవర్నర్కు టీపీసీసీ నేతలు వినతి పత్రం సమర్పించారని తెలుస్తోంది.