అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యేది అనుమానమే ? ఇపుడిదే ప్రశ్న అన్ని పార్టీల్లోను వినబడుతోంది. కారణం ఏమిటంటే తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం తో ముగుస్తోంది. అసెంబ్లీ సభ్యుడిగా కేసీయార్ వీల్ ఛైర్లో వచ్చి ప్రమాణ స్వీకారం చేసినపుడు సమావేశాలకు కూడా హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు ప్రచారంచేశారు. అయితే ప్రచారం ప్రచారంగా మాత్రమే మిగిలిపోయింది. కాలి తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత ఫాం హౌస్ లో విశ్రాంతి తీసుకున్న కేసీయార్ డాక్టర్ల సూచన ప్రకారం జనజీవన స్రవంతిలోకి వచ్చారు.
అందుకనే ఎంఎల్ఏగా ప్రమాణస్వీకారం చేసింది. అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేసిన కేసీయార్ తర్వాత ఒక్కరోజు కూడా సమావేశానికి హాజరుకాలేదు. అసెంబ్లీకి హాజరుకాని కేసీయార్ ఎక్కడో నల్గొండలో జరిగిన బహిరంగ సభకు మాత్రం హాజరయ్యారు. అక్కడ వీల్ కుర్చీలో కూర్చునే దాదాపు గంటసేపటికి పైగా కేసీయార్ మాట్లాడారు. అంతసేపు బహిరంగ సభలో మాట్లాడిన కేసీయార్ మరి అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఎందుకు హాజరు కాలేదు ? ఎందుకు హాజరు కాలేదంటే రేవంత్ రెడ్డి అండ్ కో ను ఫేస్ చేయలేకే అని సమాధానం వినిపిస్తోంది.
ఇరిగేషన్ ప్రాజెక్టులు ముఖ్యంగా కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజి విషయాలపై రేవంత్ అండ్ కో కు సమాధానాలు చెప్పలేక, జరిగిన నష్టాన్ని, నాసిరకం నిర్మాణాలను సమర్ధించుకోలేకే అసెంబ్లీ సమావేశాలకు రావటం మానేసినట్లు అనుమానంగా ఉంది. వరస చూస్తుంటే భవిష్యత్తులో కూడా కేసీయార్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే కేసీయార్ ఎప్పుడు సమావేశాలకు హాజరైతే అప్పుడు రేవంత్ అండ్ కో కాళేశ్వరం, మేడిగడ్డ అంటు మొదలుపెడతారు.
విచిత్రం ఏమిటంటే మేడిగడ్డ బ్యారేజిలో ఒక పిల్లర్ కుంగితే ఏమైపోతుందని కేసీయార్ స్వయంగా కామెంట్ చేయటం. ఒక బ్యారేజికి నిర్మించిన పిల్లర్ కుంగితే మొత్తం బ్యారేజి వీకవ్వదా ? పైగా కుంగింది ఒక పిల్లర్ కాదు నాలుగు పిల్లర్లు. వాటివల్ల మొత్తం స్ట్రక్చరే బలహీనపడిపోయి కూలిపోతే బాధ్యత ఎవరిది ? కేసీయార్ బాధ్యత వహిస్తారా ? పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కేసీయార్ నుండి ఇలా మాట్లాడుతారని ఎవరూ ఊహించలేదు. ఇక్కడ వృధా అయ్యింది ప్రజాధనమన్న విషయాన్ని మరచిపోకూడదు.