తెలివి ఏ ఒక్కడి సొత్తు కాదు. అందుకే ఒకడికి మించిన తెలివిని మరొకడు ప్రదర్శిస్తుంటారు. అయితే.. కొందరు మాత్రం తెలివితేటల పేరుతో అతి తెలివి ప్రదర్శించే ధోరణి కనిపిస్తుంటుంది.తాజాగా చెప్పే ఉదంతం రెండో కోవకు చెందినిదిగా చెప్పాలి. టీఆర్ఎస్ అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ గా మారుస్తూ గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
దీంతో.. ఇంతకాలం ప్రజల నోట్లో నానిన టీఆర్ఎస్ ను అలా వదిలేసి.. బీఆర్ఎస్ పేరును డిసైడ్ చేయటం తెలిసిందే. తెలంగాణ ప్రజల్ని తమ ఉద్యమంతో ఒక చోటుకు చేర్చి.. కేంద్రం మెడలు వంచి మరీ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటంలో టీఆర్ఎస్ ఎంతటి కీలకభూమిక పోషించిందో తెలిసిందే. అలాంటి పేరు ప్రఖ్యాతులున్న పార్టీ స్థానే కొత్త పార్టీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొందరు సిత్రమైన ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రైతు సమితి.. తెలంగాణ రక్షణ సమితి..తెలంగాణ రైతు సమాఖ్య ఇలాంటి కొత్త పేర్లతో సరికొత్త ‘టీఆర్ఎస్’ను ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే గులాబీ బాస్ వదిలేసిన టీఆర్ఎస్ పేరును ఎవరో సొంతం చేసుకొని.. దానిపై రాజకీయాలు మొదలుపెడితే.. బీఆర్ఎస్ అధినేతకు కంట్లో నలకలలా మారటం ఖాయం. టీఆర్ఎస్ కున్న మైలేజీని.. మారిన బీఆర్ఎస్ అకౌంట్లెకి మారకుండా.. ఇప్పుడు వచ్చే నకిలీ టీఆర్ఎస్ లోకి వెళితే జరిగే నష్టం భారీగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
మరి.. ఈ ఉపద్రవాన్ని గులాబీ బాస్ఏ రీతిలో ఎదుర్కొంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. ఈ వ్యవహారం వెనుక ఉన్నది ఎవరన్న విషయంపై క్లారిటీ వస్తే కానీ.. వారి విషయంలో కేసీఆర్ రియాక్షన్ ఏ రీతిలో ఉంటుందన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.