ఫలితాలు మరో 24 గంటల్లో వస్తాయనగా ఇండియా టు డే ఎగ్జిట్ పోల్ సర్వేని రిలీజ్ చేసింది. దీని ఎగ్జిట్ పోల్ జోస్యం చూసిన తర్వాత చాలామందికి నమ్మకం వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇండియా టు డే నిర్వహించిన ఎగ్జిట్ పోల్ రిలీజయ్యింది. అందులో కాంగ్రెస్ కు 63-73 సీట్లు వస్తుందని తేలింది. బీఆర్ఎస్ కు 33 నుండి 44 సీట్ల మధ్యలో వస్తుందని చెప్పింది. బీజేపీకి 4 నుండి 8, ఇతరులు 5 నుండి 8 సీట్లలో గెలవచ్చని అంచనా వేసింది.
నిజానికి 30వ తేదీ పోలింగ్ ముగిసిన తర్వాత అంటే 5.30 గంటల ప్రాంతంలోనే వరుసగా ఎగ్జిట్ పోల్స్ అంటు చాలా సంస్ధలు, మీడియాలు ఊదరగొట్టేశాయి. వీటిల్లో అత్యధికం కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని తేల్చేశాయి. సుమారు 20 సంస్ధలు ఎగ్జిట్ పోల్స్ జోస్యాలను చెబితే అందులో 16 సంస్ధలు కాంగ్రెస్ దే అధికారం అని తేల్చేశాయి. ఒకటి రెండు సంస్ధలు మాత్రం బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమన్నాయి. మరో రెండు సంస్ధలు హంగ్ అసెంబ్లీకి అవకాశముందన్నట్లుగా చెప్పాయి.
ఈ ఎగ్జిట్ పోల్స్ జోస్యాలపై మీడియాతో పాటు విశ్లేషకుల నుండి మిశ్రమ స్పందన కనబడింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్నది నిజమవ్వటానికి ఎంత అవకాశముందో కాకపోవటానికీ అంతే అవకాశముంది. కాకపోతే ఎగ్జిట్ పోల్ ను ప్రకటించిన సంస్ధ క్రెడిబులిటి మీద కూడా జనాలు నమ్మకం నమ్మక పోవటం అన్నది ఆధారపడుంటుంది. అయితే ఇన్ని సంస్ధలు ఎగ్జిట్ పోల్సంటు రచ్చచేసినా ఇండియా టు డే మాత్రం ఎగ్జిట్ పోల్ ను విడుదల చేయలేదు.
అందుకనే అందరూ ఇండియా టు డే ఎగ్జిట్ పోల్ జోస్యం కోసం ఎదురు చూశాయి. ఎందుకంటే ఇండియా టు డేకి ఉన్న క్రెడిబులిటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో ఇండియా టు డే కూడా కాంగ్రెస్ కే పట్టంగట్టింది. 63 నుండి 73 సీట్ల మధ్య కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పటంతో జనాల్లో హస్తంపార్టీ గెలుపుపై నమ్మకం పెరిగింది.