జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్ అంటూ గత కొద్దికాలంగా జరుగుతున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ తానే ఈ మేరకు క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సీఎం ఈ మేరకు తన కార్యాచరణపై సైతం స్పష్టతతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేయడం, కేంద్రం విధానాలను తప్పుపట్టడం, వివిధ అంశాలపై రియాక్టవడంతో పాటుగా రాజ్యాంగాన్ని మార్చాలనే డిమాండ్ చేసిన కేసీఆర్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. దేశం కోసం అవసరమైతే కొత్త పార్టీ పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జాతీయ రాజకీయాల గురించి కేసీఆర్ స్పందిస్తూ తాను పుట్టగానే సీఎం అవుతానని తన తల్లిదండ్రులు అనుకున్నారా అంటూ ఆదరణ ఉంటే ఎవరైనా సీఎం కావొచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఎందరో మామూలు వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి మంత్రులు అయ్యారని, పలువురు సినీ నటులు సైతం రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్ సీఎం అవ్వలేదా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కొత్త పార్టీపై కూడా గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం కేసీఆర్ కొత్త పార్టీ పెట్టాలని అందరూ కోరుకుంటే పెడతానని అన్నారు. దేశం కొత్త మార్గం పట్టాల్సిందే అన్నారు. కొత్త ఆలోచన కొత్త దృక్పథంతో ముందుకు వెళ్లాలన్నారు. కులమత జాతి భేధాలు పక్కన పెట్టి ప్రజలంతా పిడికిలి ఎత్తి ముందుకు కదలాల్సిందేనని, అప్పుడే ఈ దేశం ఆశించిన ప్రగతి సాధిస్తుందని కేసీఆర్ అన్నారు.
దేశవ్యాప్తంగా చర్చ లేపిన రాజ్యాంగం మార్చాలనే తన డిమాండ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తూ తెలంగాణలాగా భారతదేశం కూడా మారడానికి కొత్త రాజ్యాంగం కావాలంటున్నానని తెలిపారు. ‘ఏం జరుగుతుందో తనకు తెలియదు కానీ.. థింగ్స్ విల్ హ్యాపన్’ అన్నారు. ముందుగా అన్ని పార్టీలు ఐక్యం కావాలన్నారు. బ్యాంకులను ముంచిన 33 మంది విదేశాల్లో పిక్నిక్ చేస్తున్నారని పేర్కొన్న సీఎం కేసీఆర్ వీళ్లంతా మోడీ దోస్తులే..గుజరాత్ వాళ్లేనని సీఎం కేసీఆర్ ఆరోపించారు.
దమ్ముంటే తనను జైల్లో వేయాలని కేసీఆర్ సవాల్ విసిరారు. తనను జైల్లో వేయడమేమో కానీ.. బీజేపీ నేతలను జైల్లో వేయడం పక్కా అని కేసీఆర్ అన్నారు. రఫెల్ డీల్ లో మోడీ ప్రభుత్వం వేల కోట్లు దోచుకుందన్నారు. బీజేపీ అవినీతి కుంభ స్థలాన్ని బద్ధలు కొడతామన్నారు. రఫెల్ డీల్ పై సుప్రీం కోర్టులో తాము పిటిషన్ వేస్తామన్నారు. వీటన్నిటి మీద ఢిల్లీలో పంచాయతీ పెడతాని సీఎం కేసీఆర్ అన్నారు.