ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఊపిరి తిత్తులలో మండుతున్నట్లు ఉండటం వల్ల ఆయనను పరీక్షల నిమిత్తం యశోదలో చేర్పించారు.
కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవి రావు, పల్మోనాలజిస్ట్ డాక్టర్ నవనీత్ సాగర్ మరియు కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఐ, సిటి స్కాన్ మరియు ఇతర పరీక్షలు చేయించుకోవాలని వారు సిఫారసు చేశారు. ఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోనున్నారు.
కేసీఆర్ ఎపుడు అనారోగ్యం పాలైనా, చికిత్సలు అవసరం పడినా యశోద ఆస్పత్రిలోనే చేరుతుండటం గమనార్హం. మిగతా ఆస్ప్రత్రుల యాజమాన్యాల సామాజిక వర్గాలు ఆయన ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైనవి, లేదా ఆంధ్ర మూలాలు కలవారివి. ఒక్క యశోద మాత్రమే ఆంధ్రాకు గాని, లేదా తన ప్రతిపక్ష పార్టీల మద్దతు దారులది కాదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
అయితే, ముందు నుంచి కేసీఆర్ ను పరీక్షించే డాక్టర్లు అక్కడ పనిచేస్తుండటం వల్ల మాత్రమే కేసీఆర్ అక్కడ చికిత్సలకు వెళ్తుంటారని… టీఆర్ఎస్ నేతలు చెబుతారు.