తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2018లో మాదిరిగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని వారి అంచనా.
2019లో కేసీఆర్ పదవి కాలం ముగియాల్సి ఉన్నా… ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. 2018 ఎన్నికల్లో విపక్షాలను ఢీ కొట్టి భారీ మెజారిటీ సాధించారు. రెండోసారి సీఎం అయ్యారు.
ఈసారి కూడా అలాంటి ప్రయోగానికి కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి, ఉపాధి లేమి, పాలసీ, పరిపాలనా స్తంభన ఆయన ప్రభుత్వాన్ని కుంగదీస్తున్నాయి. దళితుల బంధు పథకం పెట్టి వందల కోట్లు వెచ్చించినా ఇటీవల హుజూరాబాద్‌లో ఓటమి చూడటంతో కేసీఆర్ లో భయం మొదలైంది.
హుజూరాబాద్‌లో ఓటమి కేసీఆర్‌ను ఎంతగానో కలిచివేసిందని, అందుకే ఆయన ప్రజల అసంతృప్తి ఇంకా పెరగకుండా ముందే జాగ్రత్త పడే ప్రయత్నంచేస్తున్నారు.
ఇప్పుడు బిజెపి మరియు కాంగ్రెస్ రెండూ కేసీఆర్ ను ఇరువైపుల నుంచి పొడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను రెచ్చగొట్టడం ద్వారా బీజేపీని ఎదుర్కోవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.
అయితే… కాంగ్రెస్ విషయంలో ఏం చేయాలో కేసీఆర్ కు అర్థం కావడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ కు బలమైన లీడర్ షిప్ రేవంత్ రెడ్డి రూపంలో దొరికింది. ఈ నేపథ్యంలో అతనింకా బలపడకముందే… ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు.
ఇందులో భాగమే ఇటీవల తరచుగా ప్రజల్లోకి రావడం. డిసెంబర్ 19 నుంచి కేసీఆర్ అన్ని జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో కేంద్రం, మోడీ వ్యతిరేక సెంటిమెంట్లను రెచ్చగొట్టడమే టార్గెట్. వనపర్తిలో ఆయన తన పర్యటనను ప్రారంభించనున్నారు. అనంతరం నాగర్ కర్నూల్, జగిత్యాల, వికారాబాద్, నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. 2022 ద్వితీయార్థంలో ఆయన ఎన్నికలకు వెళ్లవచ్చని వర్గాలు చెబుతున్నాయి.