సీఎం కేసీఆర్, ప్రధాని మోడీలు బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం పదిలం చేసుకోవాలని వారు చూస్తున్నారని మండిపడ్డారు. బోయిన్పల్లిలో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. కేసీఆర్, మోడీ కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ఏకమై ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ అనే విషవృక్షం దేశాన్ని కబళించాలని చూస్తోందని అన్నారు.
ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకునే వారికి.. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు నెల్సన్ మండేలా లాంటి ఎందరో నాయకులకు గాంధీ స్ఫూర్తిగా నిలిచారని రేవంత్రెడ్డి అన్నారు. ప్రపంచానికి గాంధీ ఇజాన్ని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి బాపూజీ అన్న ఆయన.. గాంధీ ఇజం చరిత్రలోనే నిలబడిందని హర్షం వ్యక్తం చేశారు. వందల సంవత్సరాలు ఈ దేశంపై ఆధిపత్యం చలాయించిన బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఎదురోడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని గుర్తుచేశారు.
ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా, డూ ఆర్ డై నినాదంతో గాంధీ ప్రపంచానికి పరిచయం అయ్యారని ఆయన అన్నారు. గాంధీ స్పూర్తితో కాంగ్రెస్ పార్టీ బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు హరిత విప్లవానికి జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రీ పునాది వేశారని గుర్తుచేశారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ల నేతృత్వంలో అభివృద్ధికి ఎన్నో చర్యలు కాంగ్రెస్ పార్టీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. బడుగు, బలహీన, గిరిజన, మైనార్టీలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన కొనియాడారు.
“రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ దేశాన్ని ఏకీకృతం చేస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పాదయాత్ర అనంతరం ఈ నెల 24న పాదయాత్ర తెలంగాణకు వస్తుంది. గాంధీ స్పూర్తితో అందరం భారత్ జోడో యాత్రలో కదం కలపాలి. సీఎం కేసీఆర్, ప్రధాని మోడీలు బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం పదిలం చేసుకోవాలని చూస్తున్నారు. కేసీఆర్ విభజించు-పాలించు అనే సూత్రం ప్రకారం పరిపాలిస్తున్నారు. వారి కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ఏకమై ముందుకు కదలాలి“ అని రేవంత్ పిలుపునిచ్చారు.