వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల అరెస్టు వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత షర్మిలకు బెయిల్ మంజూరు కావడంతో ఆమె అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా గవర్నర్ తమిళిసైని కలిసి తనకు జరిగిన అవమానం గురించి టిఆర్ఎస్ నేతల దాడి గురించి షర్మిల ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నేతలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ పార్టీలో ఉన్న వారంతా తాళిబన్లేనని, తనకేం జరిగినా టిఆర్ఎస్ ప్రభుత్వందే బాధ్యత అని షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణను కేసీఆర్ ఆఫ్ఘనిస్తాన్ మాదిరి మార్చేశారని, తాలిబన్ల తరహాలో పాలన కొనసాగిస్తున్నారని షర్మిల సంచలన ఆరోపణ చేశారు. ట్రాఫిక్ జామ్ చేశానన్న ఆరోపణలతో తనపై కేసు పెట్టి అరెస్టు చేశారని, మహిళ అని కూడా చూడకుండా తాను కూర్చుని ఉండగానే కారును బోయిన్ చేశారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
గంటల తరబడి తనను విచారణ జరిపారని, తనతో పాటు వచ్చిన కార్యకర్తలను పోలీసులు కొట్టారని ఆరోపించారు. కేసీఆర్ సూచనతోనే తనను రిమాండ్ చేయాలని పోలీసులు అనుకున్నారని, తానే నేరం చేయలేదు కాబట్టే రిమాండ్ కు జడ్జి అనుమతించలేదని అన్నారు. కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేస్తున్నానన్న కారణంతోనే తనపై కక్ష గట్టారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం వేలకోట్ల అక్రమ సంపాదన అర్జించిందని, దేశంలో అత్యంత సంపన్నమైన రాజకీయ కుటుంబం కేసీఆర్ దేనిని ఆరోపించారు.
ఆ అవినీతిని బట్టబయలు చేస్తున్నందుకే తనపై కేసీఆర్ కుటుంబం పగ సాధిస్తుందని ఆరోపించారు. తన పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని, అందుకే నర్సంపేటలో తనపై దాడి చేసి తన వాహనానికి నిప్పు పెట్టారని ఆరోపించారు. తనకు, తన పార్టీ నాయకులకు ఏం జరిగినా కేసీఆర్ ప్రభుత్వందే బాధ్యతని షర్మిల అన్నారు.