పాలకుడి విజన్ ఎంతలా ఉండాలన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేధావితనానికి కేరాఫ్ అడ్రస్ గా.. తనకున్నంత ఐడియాలనీ ప్రపంచంలో మరెవరికీ లేదన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయి. వ్యవస్థను మార్చటానికి మించిన రిస్కు మరొకటి ఉండదు. ఆచితూచి ప్లాన్ చేయకుండా.. కలల ప్రపంచంలో తిరుగుతూ..ఫాంహౌస్ లో తనకు నచ్చినోళ్లతో జరిపిన మేథోమధనం.. చేసిన ప్లానింగ్ దెబ్బకు తెలంగాణ ప్రభుత్వానికి జరిగిన నష్టం ఎంతో తెలుసా? ఒక్క రిజిస్ట్రేషన్ల ఇష్యూలోనే తెలంగాణ ప్రభుత్వానికి రూ.2514 కోట్ల నష్టం వాటిల్లింది.
దీన్ని నష్టం అని ఎలా అంటారు? మూడున్నర నెల పాటు రిజిస్ట్రేషన్లు ఆపేస్తే.. తర్వాత అయినా రిజిస్ట్రేషన్లు ఉంటాయి కదా? అన్న ప్రశ్నను సంధించొచ్చు. కానీ.. అప్పుడెప్పుడో రెండు నెలల క్రితం రిజిస్ట్రేషన్ అన్నది ఆగకుండా ఉండి ఉంటే.. భూమిని అమ్మేసినోడు.. చేతికి వచ్చిన డబ్బుల్ని వేరే దానికి మళ్లిస్తారు. ఈ లెక్కన చూసినప్పుడు రిజిస్ట్రేషన్లు ఆపేయటం వల్ల రొటేషన్ ఆగిపోయింది. దీనివల్ల ప్రైమరీగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చే ఆదాయానికి గండి పడింది. ఇది తర్వాత రికవరీ అయినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లే.
వాస్తవానికి గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాదిలో రూ.10వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది కేసీఆర్ సర్కారు. మరి.. నవంబరు నాటికి వచ్చిన ఆదాయం కేవలం రూ.1775 కోట్లు మాత్రమే. గత ఏడాది ఇదే సమయానికి వచ్చిన ఆదాయం రూ.4289 కోట్లు. అంటే ఏడాదిలో చోటు చేసుకున్న మార్పు కారణంగా కోల్పోయిన ఆదాయమే రూ.2514 కోట్లు. దాదాపు వందకు పైగా రోజులు వ్యవసాయేతర భూములకు రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆపేయటం ద్వారా ఎంత భారీగా తెలంగాణకు నష్టం వాటిల్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఫాంహౌస్ లో కూర్చొని కేసీఆర్ సారు చేసిన ప్లానింగ్ ఏమో కానీ.. దెబ్బకు వేలాది కోట్ల ఆదాయంతో పాటు.. ప్రజల్లోనూ బద్నాం కావాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఇకనైనా.. అద్భుతమైన ప్లాన్లు వేసే ముందు.. కోటరీలో ఉన్న వారితో కాకుండా కోట బయట ఉన్న వారితో మాట్లాడితే.. వారి ఫీడ్ బ్యాక్ ప్రభుత్వానికి మేలు చేస్తుందన్న విషయాన్ని కేసీఆర్ సారు ఇప్పటికైనా గుర్తిస్తారో లేదో?