కేసీఆర్ మళ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో అసమ్మతితో రగిలిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్లు. సొంత పార్టీ అయినప్పటికీ ఇతర నాయకులకు టికెట్లు దక్కడంతో వీళ్లను శత్రువులుగా చూస్తూ ఇన్ని రోజులు దూరంగా పెట్టారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా కలిసిపోయి మరీ ప్రచారానికి వెళ్తున్నారు. దీని వెనుక బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జరిపిన మంతనాలున్నాయి. ఒక్కోక్కరిగా అసమ్మతి నేతలను దారిలోకి తెస్తున్న కేసీఆర్.. ఆయా నియోజవకర్గాల్లో అభ్యర్థుల విజయం కోసం కలిసి పని చేసేలా చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సారి చెన్నమనేని రమేశ్ ను కాదని వేములవాడ టికెట్‌ను చల్మెడ లక్ష్మినరసింహా రావుకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే చెన్నమనేని అసంత్రుప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఆయనకు వ్యవసాయ రంగ ప్రభుత్వ సలహాదారుగా కేబినేట్ హోదాతో కూడిన పదవి ఇచ్చి కేసీఆర్ బుజ్జగించారు. ఇప్పుడు చల్మెడ విజయం కోసం చెన్నమనేని కూడా కలిసి పని చేస్తున్నారని టాక్. అలాగే వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ భవిష్యత్ పైనా కేసీఆర్ హామీ ఇవ్వడంతో.. అక్కడ మదన్ లాల్ విజయం కోసం పని చేస్తానని ఆయన ప్రకటించారు.
ఇక ఆసిఫాబాద్‌లోనూ జడ్పీ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కష్టపడతానని అక్కడి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా చెబుతున్నారు. అంతే కాకుండా ఆమెతో కలిసి సక్కు ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. బోథ్‌లోనూ అభ్యర్థి అనిల్ జాదవ్‌తో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కలిసిపోయారని తెలిసింది. తాండూర్‌లో టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి పదవితో కేసీఆర్ శాంతింపజేశారు. దీంతో అక్కడ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరోసారి గెలిపించేందుకు ఈ సీనియర్ నేత సన్నాహాలు చేస్తున్నారు.