సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. ఏమైనా మాట్లాడే దమ్ము తనకు మాత్రమే ఉందనే దూకుడు ప్రదర్శించే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఆయన.. ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగటానికి కొద్ది గంటల ముందుగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు చూస్తుంటే.. రాజకీయ వ్యూహంలో భాగంగా దూకుడుగా మాట్లాడారా? అన్న సందేహం కలుగక మానదు.
తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని.. కేసీఆర్ అవినీతి ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఎన్నికలు తప్పవని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారన్నారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయం. ఒక్కో డివిజన్ కు రూ.5కోట్లు ఇస్తున్నారు. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకోండి. బీజేపీకి ఓటు వేయండి’ అన్నారు. కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు ఎవరూ వెళ్లటం లేదన్న ఆయన.. సారు. కారు.. కేసీఆర్ ఇక రారు అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
తాను ఇంట్లో చెప్పే వచ్చానని.. చావుకు సిద్ధమయ్యానన్న బండి సంజయ్.. ఘాట్ల మీద చేయి పడితే.. దారుస్సలాం ఉండదంటూ మరోసారి హీట్ పెంచే వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆయన కుటుంబం మంచిగా ఉండాలన్న సంజయ్.. ఆయన అవసరం ప్రజలకు అవసరం లేదని తేల్చేశారు. మరి.. బండి చేసిన హాట్ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.