పీకే…ఈ పేరు వినగానే చాలామంది నేతలకు రాజకీయ వ్యూహకర్త, ‘ipac’అధినేత ప్రశాంత్ కిషోర్ గుర్తుకు వస్తారు. 2014లో మోడీని పీఎం చేయడంలో ఆ తర్వాత నితీశ్, జగన్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్ వంటివారిని సీఎంలను చేయడంలో పీకేదే కీలక పాత్ర అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, తనను నమ్ముకున్న రాజకీయ నేతలను గెలిపించడంలో భాగంగా పీకే…తన మార్క్ రాజకీయాలు చేస్తుంటారని టాక్ ఉంది.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నేటి ఏపీ సీఎం…నాటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తి దాడి ఎపిసోడ్ తో పాటు, 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మమతపై దాడి ఎపిసోడ్ వరకు పీకే ఎన్నో పొలిటికల్ థ్రిల్లర్ ఎపిసోడ్ లను రక్తికట్టించారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ ఘటనల ద్వారా భారీగా సింపతీ కొట్టేసిన జగన్, మమతా బెనర్జీలు సీఎంలు అయ్యారని జగన్ పై దాడి తెలుగు వెర్షన్ ను బెంగాలీలో పీకే రీమేక్ చేశారని సెటైర్లు వేశారు.
బెంగాల్ లో మమతపై దాడి ఘటనలో ఈసీ నియమించిన అధికారులు అసలు దాడి జరిగినట్టు ఆధారాలు లేవని, కారు డోర్ మూసుకుపోవడం వల్లే దీదీ కాలికి గాయమైందని నివేదికనిచ్చారు. ఇక, తెలంగాణలో కేసీఆర్ కు సలహాలిస్తున్న పీకే…కోడికత్తి ఎపిసోడ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఫార్ములాతో తెలంగాణలోనూ హిట్ కొట్టాలని చూస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకు కేసీఆర్ ఈ ప్లాన్ వేశారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిశోర్ తో కలిసి కేసీఆర్ నాటకాలకు తెర తీశారని రేవంత్ ఎద్దేవా చేశారు. పీకే సూచనలతో సారు కొత్త డ్రామాలు మొదలయ్యాయని సెటైర్లు వేశారు. ఇటీవల ఛాతీలో నొప్పితో కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.