కేంద్రంలోని బీజేపీ పెద్దలు తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలపై సీబీఐ, ఈడీ సోదాల పేరుతో కక్ష సాధిస్తున్నారన్న వాదనలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈనాడు బీజేపీ..గతంలో కాంగ్రెస్..ఇలా ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే ఆ పార్టీ చేతిలో ఈడీ, సీబీఐలు కీలుబొమ్మలుగా మారాల్సిందేనన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఇటువంటి విపత్తును ముందే గ్రహించిన విజనరీ చంద్రబాబు…తన హయాంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తమ సమ్మతి లేకుండా ఏపీలో సీబీఐ అడుగుపెట్టడానికి వీల్లేదంటూ షరతు విధించారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1946 సెక్షన్ ప్రకారం ఏదైనా రాష్ట్రంలో దర్యాప్తు నిర్వహించాలంటే సీబీఐ ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అంతేకాదు, ఒకవేళ రాష్ట్రాలు తమ సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటే ఆ రాష్ట్ర పరిధిలో ఏదైనా కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. గతంతో చంద్రబాబు బాటలో 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ సమ్మతిని ఉపసంహరించుకున్నారు.
అయితే, తాజాగా తెలంగాన సీఎం కేసీఆర్ కూడా చంద్రబాబు బాటలో పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. బీహార్ పర్యటనలో ఉన్న కేసీఆర్… తెలంగాణ ప్రభుత్వం కూడా సీబీఐ ఎంట్రీ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు హింట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. బిహార్‌లో లాలూ కుటుంబసభ్యులు, ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడుల నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కూడా సీబీఐకి సమ్మతినివ్వలేదు.
సీబీఐ, ఈడీ, ఐటీలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని, సీబీఐని బిహార్‌లోకి అనుమతించకపోవడాన్ని సమర్థిస్తున్నానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతీ రాష్ట్రం ఇదే చేయాలని, శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని, సీబీఐ లాంటి సంస్థలు రాష్ట్రాల్లోకి చొరబడటం కరెక్ట్ కాదని కేసీఆర్ అన్నారు. దీంతో, గతంలో చంద్రబాబు తీసుకుున్న నిర్ణయాన్ని కేసీఆర్ కూడా ఫాలో కాబోతున్నారా అన్న టాక్ వస్తోంది.