మహారాష్ట్ర మాదిరిగా తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చడం అన్నది జరగని పని అని సీఎం కేసీఆర్ అంటున్నారు. ఈ మాటలు అతిగా అనిపిస్తున్నాయి అని విశ్లేషకులు అంటున్నారు. అసలు మహారాష్ట్ర పరిణామాలు ఎక్కడ..తెలంగాణ పరిణామాలు ఎక్కడ.. ఏమయినా పోలిక ఉందా ? ఫుల్ మెజార్టీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్ కు ఎందుకు ఇన్ని భయాలు ?
అయినా ఇప్పుడు తెలంగాణలో రాజకీయ సంక్షోభం తెస్తామని ఏమయినా బీజేపీ బీరాలు పలికిందా ? రాగాలు తీసిందా ? లేదు కదా! మరి! ఈ పాటి దానికి ఎందుకని కేసీఆర్ భయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవసరం లేకపోయినా ఆ మాటలు మాట్లాడుతున్నారని?
తెలంగాణపై కన్నేస్తే ఢిల్లీలో గద్దె దించుతాం అని కేసీఆర్ ఎందుకని అంటున్నారు.ఆ పాటి శక్తి కేసీఆర్ ఉందని ఎలా అనుకోగలం అని కూడా అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఇంకా కేసీఆర్ పూర్తి స్థాయిలో అడుగు పెట్టలేదు. వచ్చే ఏడాదే ఎన్నికలు ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమే అని అన్ని పార్టీలూ అంటున్నాయి. ఈ తరుణాన కేసీఆర్ కు రాజ్యాంగ సంక్షోభం వస్తుందని ఎవరైనా చెప్పి ఉన్నారా ? లేదా ఆయనే ఇవన్నీ ఊహించుకుని భయాందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారా ?
వాస్తవానికి ఓ కేంద్ర మంత్రి మాటలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ ఆ విధంగా మాట్లాడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ లో ఏ పాటి చీలికలు కూడా తెచ్చే అవకాశం లేదని బీజేపీకి తెలుసు. కనుక ఏదో అలజడి రేపడానికి చెప్పే మాటలను ప్రామాణికంగా తీసుకుని కేసీఆర్ తన స్థాయిని తగ్గించుకునే మాట్లాడుతున్నారు అన్న మాట కూడా వినవస్తోంది.
ఢిల్లీలో సింహాసనం కదపడం అంత సులువు కాదు ! ఎందుకంటే బీజేపీ ఇప్పటికే బలమైన పార్టీగా ఎదిగి ఉంది. ప్రాంతీయ పార్టీల నుంచి నాయకులు వెళ్లి ఢిల్లీ రాజకీయాలను శాసించేంత సీన్ ఇప్పటికప్పుడు లేదు. కేసీఆర్ అనే కాదు చాలా మంది నాయకులకు ఢిల్లీ రాజకీయాలు అంత వేగంగా పట్టుకు చిక్కవు.
కొంత కాలం ఆలోచించి, ఆచితూచి అడుగులు వేయాల్సిందే. చక్కగా ఉన్న ప్రాణానికి ఎందుకు వచ్చిన కష్టాలు అని కూడా కొన్ని మాటలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. ఏదేమయినా తెలంగాణలో మహా సంక్షోభం రాదు కానీ కేసీఆర్ మాత్రం ఓ నాయకుడిగా ఇంకా బలోపేతం కావాల్సి ఉంది.