ఇపుడిదే ప్రశ్న తెలంగాణ అంతటా వినిపిస్తోంది. హైదరాబాద్ లో మొదలైన వరి రాజకీయాన్ని కేసీయార్ ఢిల్లీ దాకా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. వరి కొనుగోలు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడితో, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించి వాళ్ళ మెడలు వంచుతానని ధర్నాలో చెప్పిన కేసీయార్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ఏమి చేసుకొచ్చారో ఎవరికీ అర్థం కావటం లేదు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే క్యాంపు వేసినా మోడి, షా ను కలవకుండానే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
కేంద్రం-రాష్ట్రం మధ్య మొదలైన వరి రాజకీయంపై ఎవరు కూడా ఒక్క మెట్టు కూడా దిగలేదు. రాష్ట్రాల నుండి బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం తాజాగా మరోసారి స్పష్టం గా ప్రకటించింది. ఇదే సమయంలో తెలంగాణా నుంచి కేంద్రం ఎందుకని బాయిల్డ్ రైస్ కొనదో చూస్తానని కేసీయార్ చేసిన ప్రతిజ్ఞ నెరవేరేట్లు లేదు.
రా రైస్ మాత్రమే కొంటామని కేంద్రం పదే పదే చెబుతున్నా కేసీయార్ మాత్రం రా రైస్ గురించి కాకుండా కేవలం బాయిల్డ్ రైస్ గురించి మాత్రమే పదే పదే ప్రస్తావిస్తున్నారు. కేంద్రం సమస్య ఏమిటంటే బాయిల్డ్ రైస్ నిల్వలు ఇప్పటికే లక్షలాది టన్నులు పేరుకుపోయున్నాయి. విదేశాల్లో కూడా ఇపుడు బాయిల్డ్ రైస్ ను ఎవరు కొనటం లేదు.
విదేశాల్లోనే కాకుండా దేశంలో కూడా బాయిల్డ్ రైస్ వాడకం తగ్గిపోయి రా రైస్ వాడకమే బాగా పెరిగిపోయింది. దీంతో దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ డిమాండ్ లేకపోవటంతో బాయిల్డ్ రైస్ కొనకూడదని కేంద్రం డిసైడ్ చేసుకున్నది. కేసీయార్ ఆరోపిస్తున్నట్లు పంజాబ్ లో కేంద్రం కొన్నది బాయిల్డ్ రైస్ కానేకాదు. రా రైస్ మాత్రమే కొనుగోలు చేసింది.
ఈ నేపధ్యంలోనే కేంద్రంపై కేసీయార్ వరి రాజకీయం పేరుతో పెద్ద యుద్ధమే ప్రకటించారు. అయితే కేంద్రం ఆలోచనలో మార్పు రానిదే కేసీయారు ఎన్ని యుద్ధాలు ప్రకటించినా ఉపయోగం లేదు. ఈ విషయంలో కేంద్రంతో యుద్ధమంటే సినిమాలో ఫైటింగుల్లాంటివనే అనుకోవాలి.
దేశంలో ఏ రాష్ట్రం నుండి కూడా బాయిల్డ్ రైస్ కొనకూడదని కేంద్రం డిసైడ్ అయినాక తెలంగాణా నుంచి మాత్రం ఎలా కొంటుంది. ఇక్కడ సమస్యేమిటంటే రైతులు, మిల్లర్ల నుండి బాయిల్డ్ రైస్ కొంటే తెలంగాణా ప్రభుత్వం ఏమి చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం సమస్య, కేంద్రం సమస్యా ఒకటే.
అందుకనే ఒకళ్ళ మీద మరొకళ్ళు తప్పును నెట్టేసుకుంటున్నారు. ఎవరికి వారు తప్పు తమది కాదంటే తమది కాదని ఎదుటివారిని రైతుల ముందు బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర-రాష్ట్రాల పోరులో మధ్యలో రైతులు నలిగిపోతున్నారు. కాబట్టి ఈ సమస్యకు రెండు ప్రభుత్వాలు కూర్చుని ఏదన్నా శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవాలి. లేకపోతే ప్రతి ఏడాది ఇదే సమస్య పునారవృతమవుతునే ఉంటుంది. రెండు ప్రభుత్వాలు కూడా రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.