టీఆర్ఎస్ కు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో దిగిన ఈటలను ఓడించేందుకు అధికారా పార్టీ అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే ఈటలను ఢీకొట్టగలిగే సమర్థుడైన అభ్యర్థి కోసం టీఆర్ఎస్ జల్లెడ పట్టింది.
హుజురాబాద్ బైపోల్ బరిలో నిలిచేందుకు టీఆర్ఎస్ తరఫున పలువురు పేర్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 16న హుజూరాబాద్‌లో నిర్వహించే దళిత బంధు ప్రారంభ సమావేశం, బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ పరిచయం చేయనున్నారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. విద్యార్థి నాయకుడిగా బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడిన శ్రీనివాస్…కేసీఆర్ ప్రసంగాలకు ఆకర్షితుడయ్యారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ తరఫున వివిధ స్థాయిల్లో పలు బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాస్…2017 నుండి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
తెలంగాణ మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మిలియన్ మార్చ్ సహా పలు ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న గెల్లు శ్రీనివాస్ పై 100కు పైగా కేసులు నమోదయ్యాయి. 2001 నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలకపాత్ర పోషించిన శ్రీనివాస్… ఉద్యమ సమయంలో 2 సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. చర్లపల్లి సెంట్రల్ జైలులో 36 రోజుల పాటు జైలు జీవితం గడిపిన శ్రీనివస్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ కృషికి గుర్తింపుగా ఈటలపై పోటీకి కేసీఆర్ నిలబెట్టారు.