తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కూడా తమదే అధికారమని తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ పనికిమాలిన పార్టీలు పని కట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆత్మీయ సమ్మేళనాల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ఆయన ఆత్మీయ సందేశం ఇచ్చారు. 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న ఆయన.. అధికారం లేకున్నా ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకొని.. లాఠీలకు, జైళ్లకు వెరవకుండా రేయింబవళ్లు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత, కీర్తి గులాబీ సైనికులకే దక్కుతుందని అన్నారు.
ప్రజా ఆశీర్వాదం మనకే
ప్రజల ఆశీర్వాదం.. నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి.. 2 సార్లు తెలంగాణలో బీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టిందన్న కేసీఆర్.. ప్రజల ఆశీర్వాదం మనకే ఉందని చెప్పారు. పట్టుదల, అంకితభావంతో పని చేస్తూ అపూర్వ విజయాలు సాధించిపెట్టిన కార్యకర్తల బలంతోనే 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా బీఆర్ఎస్ ఎదిగిందని ప్రకటించారు.
అన్నీ ఏకపక్ష విజయాలే!
పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎవ్వరికీ సాధ్యంకాని ఏకపక్ష విజయాలు సాధిస్తూ.. రికార్డులను తిరగరాసి 21 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొందని కేసీఆర్ తెలిపారు. కష్టసుఖాల్లో కలిసి నడుస్తూ.. గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి కొండంత అండగా నిలిచిన కార్యకర్తల రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేనని ముఖ్యమంత్రి తెలిపారు. ఇతరులకు పాలిటిక్స్ అంటే గేమ్.. బీఆర్ఎస్కు మాత్రం టాస్క్ అన్న కేసీఆర్.. రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నెరవెర్చే పవిత్ర కర్తవ్యంగా భావించి కొత్తపంథాలో నడుస్తూ కోటి ఆశలతో ఏర్పడ్డ తెలంగాణను కోటి కాంతులు విరజిమ్మే నేలగా తీర్చిదిద్దుకున్నట్లు వివరించారు.
చైతన్యానికి మారు పేరు!
తెలంగాణ చైతన్యం తొణికిసలాడే గడ్డ అని కేసీఆర్ చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సమస్యలే ఇతివృత్తంగా పని చేస్తున్న బీఆర్ఎస్ను తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదని విశ్వాసం వ్యక్తం చేశారు. చిల్లర, మల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ ఆదరించబోదన్న కేసీఆర్.. తెలంగాణతో బీఆర్ఎస్ది పేగుబంధమని అన్నారు. పురిటిగడ్డపై గులాబీపార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల సంవత్సరంలో..
ఎన్నికల సంవత్సరంలో నిరంతరం ప్రజల్లో ఉంటూ పనికి మాలిన పార్టీలు పని కట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలని శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత శ్రేణుల భుజ స్కంధాలపైనే ఉందన్న కేసీఆర్.. ధర్మమే జయిస్తుందని అన్నారు.