టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా ప్రసంగించిన పార్టీ రథసారథి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ దేశానికి కావాల్సింది రావాల్సింది ఒక అద్భుతమై ప్రగతి పథంలో తీసుకెళ్లే ఎజెండా అని కేసీఆర్ పేర్కొన్నారు.
“దేశం కోసం రాజకీయ ఫ్రంట్లు కాదు.. ఇవేం సాధించలేవు.. ఇవాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి. ఆ సిద్ధాంతానికి ప్రతిపాదిక పడాలి“ అని సీఎం కేసీఆర్ విశ్లేషించారు. అయితే, ఇందుకోసం తన కార్యాచరణను ప్లీనరీ ముగింపు సందర్భంగా ప్రకటించారు.
చేయగలిగే సామర్థ్యం, సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగే వనరులను భారత్ కలిగి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. “కేసీఆర్ రాజకీయ ఫ్రంట్ ప్రకటిస్తాడా? అని అంటున్నారు. దేశం బాగుపడటానికి మన రాష్ట్రం నుంచి ప్రారంభం జరిగితే అది మనందరికీ గర్వకారణం. దేశం బాగు కోసం ఒక ప్రాసెస్ జరగాలి. భారతదేశ ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ ఉంటుంది. ఈ దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దే ప్రత్యామ్నాయ ఎజెండాకు శ్రీకారం చుడుదాం` అని సీఎం అన్నారు. అవసరమైన సమయంలో జాతీయ రాజకీయాల పై ముందుకు వెళతాం అని కేసీఆర్ ప్రకటించారు.
దేశ రాజకీయాల్లో తమ కార్యాచరణను ఈ సందర్భంగా కేసీఆర్ వివరించారు. `దేశానికి కొత్త ఎజెండాను తయారు చేయడానికి నేను ఒక సైనికున్ని అవుతా. జాతీయ రాజకీయాల పై దేశ- విదేశాల నుంచి ముఖ్యమైన చర్చలు 15 రోజులు త్వరలో జరుపుతాం. ఐఏఎస్లు, రిటైర్డ్ ఉన్నతాధికారులతో హైదరాబాద్ లో సమావేశం పెడుతాను. జాతీయ పార్టీ కోసం ఫండ్ కావాలంటే టీఆరెస్ కు ఉన్న 60లక్షల సభ్యత్వమే మా బలం. 60లక్షల సభ్యత్వం ఉన్న మాకు తలా ఒక్క వెయ్యి రూపాయలు ఇచ్చినా 600 కోట్లు అవుతుంది. జాతీయ పార్టీ అంటే దాతలు విరాళాలు ఇచ్చారు. టీఆరెస్ పార్టీకి 861కోట్లు నిధులు ఉన్నాయి“ అని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.