ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవిత పేరు జోరుగా వినిపించడం, ఈ క్రమంలోని ఆమెకు సీబీఐ నోటీసులు జారీ చేయడం సంచలనం రేపుతోంది. ఈ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన సౌత్ బెల్టును కవితతో పాటు వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నడిపించారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై తెలంగాణ బిజెపి ఇంచార్జ్ తరుణ్ చుగ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ మద్యం కుంభకోణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర కూడా ఉందని తరుణ్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, వీరితోపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ల పాత్ర కూడా ఉందని ఆరోపణలు గుప్పించారు. ఈ కుంభకోణంపై లోతైన విచారణ జరిపించాలని, అప్పుడే మరింతమంది బిగ్ షాట్ ల పేర్లు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.
అవినీతి కుంభకోణాలకు పాల్పడితే ఎవరైనా సరే విచారణ ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమ ఫోన్లను ధ్వంసం చేశారని, వారు తప్పు చేశారనడానికి ఇదే నిదర్శనమని ఆయన ఆరోపణలు గుప్పించారు. మరోవైపు, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసుల వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ నోటీసులిచ్చిన విధానంపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.
ఈ కుంభకోణంలో ఉన్న వారందరినీ ఢిల్లీకి పిలిపించి విచారణ చేస్తున్నప్పుడు కవితకు మాత్రం మినహాయింపు ఎందుకు ఇచ్చారని రేవంత్ ప్రశ్నించారు. కవితను ఇంట్లోనే విచారణ చేస్తాం అనడంలో అంతర్యం ఏమిటని నిలదీశారు. అసలు విషయం ఏంటో ఇక్కడే తెలుస్తోందని అన్నారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ లు బెంగాల్ ఫార్ములాను అమలు చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు ఓ వీధి నాటకాన్ని తలపిస్తోందని, ఈ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.