ఏదో అనుకుంటే మరేదో అయ్యింది. వరద బాధితులకు చరిత్రలో మరెప్పుడూ లేనట్లుగా భారీ ఆర్థిక సాయాన్ని అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోవటం.. ఒక్కొక్కరికి తాత్కాలికంగా రూ.10వేలు.. తర్వాత మరింత పరిహారం ఇచ్చేందుకు సిద్ధం కావటం తెలిసిందే. రూ.10వేల మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తుంటే.. ఇంకేం కావాలన్నట్లుగా బాధితులకు బదులుగా సంబంధం లేని వారికి భారీ ఎత్తున పరిహారం పక్కదారి పట్టింది. దీంతో.. ఒళ్లు మండిన అసలైన బాధితులు రోడ్ల మీదకు ఎక్కారు.
హైదరాబాద్ మహానగరంలో మల్కాజిగిరి నియోజకవర్గం మొదలు.. ఇవతల పక్కన ఉన్న రాజేంద్రనగర్ నియోజకవర్గం వరకు ప్రతి దగ్గరా ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. అసలైన బాధితుల్ని వదిలేసి.. ఎవరెవరికో ఇస్తారా? అంటూ మండిపడటమే కాదు.. ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.
పలువురు కార్పొరేటర్ల ఇళ్ల వద్ద ఆందోళన నిర్వహించగా.. మా ఇళ్ల ముందు ఆందోళన చేస్తే లాభం ఏముంది? పదండి నేనూ మీతో వచ్చి ధర్నా చేస్తానంటూ జీహెచ్ఎంసీ ఆఫీసుల ముందు నిరసనలు చేపడుతున్నారు.
నగరంలోని టీఆర్ఎస్ ఎమ్మెుల్యేల ఇళ్ల ముందు.. వారి క్యాంపు కార్యాలయం ముందు ఆందోళనలు నిర్వహిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో.. వాతావరణం వేడెక్కిపోయింది. అంబర్ పేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఇంటి ముందు ఒక వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయగా.. ఆయన చుట్టూ ఉన్న వారు బలవంతంగా ఆపారు.
ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఒక బాధితుడు పరిహారం కోసం నాలుగైదు రోజులుగా తిరుగుతున్నా.. అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన అతడు గుండెపోటుతో మరణించాడు. దీంతో.. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
వరద బాధితులకు ప్రభుత్వం అపన్న హస్తం అందించేందుకు ఇస్తున్న రూ.10వేల సాయంతో భారీ మైలేజీ వస్తుందని భావించిన తెలంగాణ అధికారపక్షం నేతలకు ఇప్పుడు దిమ్మ తిరిగే షాకులు తగులుతున్నాయి. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన అన్ని చోట్ల బాధితులు నిరసనలు తెలుపుతున్నారు. పరిహారం పంపిణీ విషయంలో అవతకవతకలు చోటు చేసుకున్నాయని.. అధికారులు.. నేతలు చేతివాటాన్ని ప్రదర్శించినట్లుగా బాధితులు మండిపడుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా చెబుతున్నారు.