టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టుపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సైలెంట్ గానే ఉన్నారు. మరోవైపు పక్క రాష్ట్రం విషయాలకు తమకు అవసరం లేదన్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ బాబు అరెస్టుపై రియాక్టవదనే అంతా అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా బాబు అరెస్టుపై స్పందించడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా బీఆర్ఎస్ నేతలు బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ర్యాలీల్లోనూ పాల్గొంటుండటం మరింత హాట్ టాపిక్ గా మారింది.
చంద్రబాబు అరెస్టుపై ఇప్పటికే సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ రియాక్టయ్యారు. బాబు అరెస్టును ఖండిస్తూ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపైనా వీళ్లు విమర్శలు చేశారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి కూడా బాబు అరెస్టును ఖండించారు. వీళ్లే కాకుండా మరికొంత మంది బీఆర్ఎస్ నాయకులు కూడా చంద్రబాబు అరెస్టుపై వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో బాబుకు మద్దతుగా జరిగిన ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొనడం మరింత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, కోదాడ లాంటి చోట్ల బాబుకు మద్దతుగా జరిగిన ర్యాలీల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొనడం గమనార్హం.
ఓ వైపు పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం చంద్రబాబు అరెస్టుపై రియాక్టయ్యారు. పైగా ఇందులో చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన నాయకులు ఉండటం గమనార్హం. అయితే పార్టీ పరంగా ఏం చేయాలన్నా.. బయట ఎలాంటి వ్యాఖ్యలు చేయాలన్నా కేసీఆర్ అనుమతి తప్పనిసరనే అభిప్రాయాలున్నాయి. కేసీఆర్ కు చెప్పకుండా, ఆయనకు తెలియకుండా బీఆర్ఎస్ నేతలు ఏం చేయలేరనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బాబు అరెస్టుపై నాయకుల స్పందన గురించి కూడా ముందుగానే కేసీఆర్ కు తెలిసే ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా ఆయన ఈ విషయంపై మాట్లాడకుండా.. తన పార్టీ నాయకులతో మాట్లాడిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.