ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రంగా మారిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యకు కేసీఆర్ ముఖం కూడా చూపించలేదు. తాజాగా మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రగతి భవన్‌కు వచ్చిన రాజయ్య సుమారు రెండు గంటల పాటు సీఎం ఆహ్వానం కోసం వేచి ఉన్నారు. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో వేచి చూసిన అనంతరం.. తిరిగి వెళ్లి పోయారు. ఇదిలావుంటే.. మంత్రి కేటీఆర్ సైతం రాజయ్యపై తీవ్రస్థాయిలో మండిపడినట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నారు. రోడ్డున పడితే.. మీతో పాటు మేం కూడా తిప్పలు పడాల్సి వస్తోందని ఘాటుగా హెచ్చరించినట్టు సమాచారం.
ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య రాజకీయ దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరువురు తీవ్ర వ్యాఖ్యలతో రోడ్డున పడ్డారు. వీరి వివాదం.. రాజకీయంగానే కాకుండా.. ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పడేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే రాజయ్యను ప్రగతిభవన్‌కు పిలిపించి క్లాస్ తీసుకున్నారు. కడియంను ఎందుకంటే.. డీప్ కార్నర్ చేయాల్సి వచ్చిందని నిలదీసినట్టు తెలిసింది. ఆయన పుట్టుక గురించి ఎందుకు మాట్లాడారని కూడా ఆయన ప్రశ్నించినట్టు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వివాదాలను రాజయ్య మంత్రి కేటీఆర్‌కు కూలంకషంగా వివరించినట్టు తెలిసింది. అయితే.. ఇప్పటికి అయిపోయిందని.. ఇంకోసారి రిపీట్ కావద్దని మంత్రి కేటీఆర్ హెచ్చరించారని తెలిసింది. పార్టీ అంతర్గత గొడవల వల్ల ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉందని.. సీనియర్లు అయిన మీరే ఇలా రోడ్డున పడితే ఎలా అంటూ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అనంతరం.. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు రాజయ్య ప్రగతి భవన్లో రెండు గంటల సేపు వెయిట్ చేశారు. అయినా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు.దీంతో రాజయ్య తిరుగు ముఖం పట్టారు.