తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు గురించి ఆయన కుమార్తె, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు.. శాసన మండలి వేదికగా.. తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణలో హాట్ టాపిక్ అయింది.
వాస్తవానికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలోను, రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించడంలోను.. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలోనూ తాము దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని అధికారపార్టీ టీఆర్ఎస్ మంత్రులు తరుచుగా చెబుతుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు మంత్రి హరీష్ రావు కూడా సభల్లో దుమ్మురేపుతారు..
అంతేకాదు.. ఎవరైనా కేసీఆర్‌పైనా.. ఆయన పాలనపైనా విమర్శలు చేస్తే.. అస్సలు తట్టుకోలేరు. కేసీఆర్‌ను మించిన నాయకుడు లేరంటూ.. ఎక్కడ మాట్లాడినా.. టీఆర్ ఎస్ పార్టీ నేతలు తరుచూ కొనియాడుతుంటారు. అయితే కేసీఆర్ పాలనపై ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత పెదవి విరిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై శాసనమండలిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును నిలదీశారు. ప్రజా ప్రతినిధులకు కనీసం కూర్చోడానికి కూడా కుర్చీ లేదని సూటిగా ప్రశ్నించారు. పంచాయతీరాజ్ మంత్రి చొరవ తీసుకుని దీనికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కొత్తగా మండలాలు ఏర్పాటైనా ఎంపీపీలకు తగిన కార్యాలయాలు లేవని, రోజువారీ అధికారిక విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారిని ప్రజా ప్రతినిధులుగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాదు.. కొందరు ఉన్నతస్థాయి అధికారులు అసలు ఎంపీటీసీలను.. మండలాల ప్రజాప్రతినిధులను గుర్తించడం లేదని.. ఇది సరైన విధానం కాదని.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వాలని కూడా సూచించారు.
మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చి.. మండలాల్లో.. ఎంపీపీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని అన్నారు. దీనికి మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. అయితే.. కేసీఆర్ సర్కారుపై ఆయన కుమార్తె ఇలా సభలోనే అసంతృప్తి వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది. ఇక, విపక్షాలు మరింత రెచ్చిపోతాయేమో చూడాలి.