తెలంగాణ రాజకీయాలు మరోసారి రాజుకున్నాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పసుపుబోర్టు తీసుకొస్తానని మూడేళ్ల క్రితం హామీ ఇచ్చిన ఎంపీ.. ఇప్పటికీ తీసుకురాలేకపో వటంపై నిజామాబాద్ ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. పసుపు బోర్డు, మద్దతుధరపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
హైస్పీడ్‌లో అబద్ధాలు చెప్పడం తప్ప బీజేపీ నేతలు చేసిందేమీ లేదని కవిత నిజామాబాద్‌లో ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అభివృద్ధిని ప్రజలు గమనించాలని కవిత కోరారు.
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు యథేచ్ఛగా పెంచారన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ మూడేళ్ల కిందట పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. అర్వింద్‌కు ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉందని.. పసుపుబోర్డు ఎప్పుడు తెస్తారని ప్రశ్నించారు.
నిజామాబాద్ ప్రజలకు ఏం జవాబు చెబుతారని నిలదీశారు. పసుపు విషయంపై స్పష్టంగా ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. “పసుపుకు మద్దతు ధర ఇస్తామని ఎంపీ చెప్పారు. ఆ విషయం ఏమైంది? పార్లమెంట్లో దీనిపై ఎప్పుడు మాట్లాడారు? ఈ మూడేళ్లలో ఎంపీ అర్వింద్ పార్లమెంట్లో ఐదుసార్లు మాట్లాడారు. ఆ సమయంలో పసుపు బోర్డు గురించి మాట్లాడలేదు.
మద్దతు ధర ఇవ్వమని అడగలేదు. మన పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ అధర్మపురి అర్వింద్. ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలడి పొద్దు గడుపుతారు? ఎర్రజొన్నకు మద్దతు ధర ఇస్తామన్నారు. అది ఏమైంది? రైతుల రాబడి రెట్టింపు చేస్తామన్నారు. ఆ విషయంలో పురోగతి ఏది? వీటిపై నిజామాబాద్ ప్రజలకు జవాబు చెప్పాలి“ అని కవిత నిలదీశారు.
ఇచ్చిన హామీల గురించి ప్రయత్నాలు చేస్తారేమో అని మూడేళ్లు విడిచిపెట్టాం. ఇక విడిచిపెట్టేది లేదన్నారు. మీరు ఢిల్లీలో మోకాళ్ల యాత్ర చేస్తారో.. మీ ఢిల్లీ నాయకుల వద్ద మోకరిల్లి పసుపు బోర్డు సాధించుకోని వస్తారో.. ఏం చేస్తారో చేయండి. బాండు పేపర్లో చెప్పినట్లు పసుపు బోర్డు పట్టుకొనే రండి. లేకపోతే ఏ గ్రామానికి పోయినా అడుగడుగునా నిలదీస్తాం అన్నారు.
పసుపుబోర్డు కాకుండా రూ.కోటీ 92 లక్షలతో స్పైస్ బోర్డు తెచ్చి.. ఓ అపార్ట్మెంట్లో పెట్టారని ఎద్దేవా చేశారు. దీని గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఉపయోగం కూడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. మరి కవిత కామెంట్లపై.. అర్వింద్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.