ఈమధ్య తరచూ బీఆర్ఎస్ లో బాగా హడావుడి కనిపిస్తోంది. ఈ హడావుడంతా ఎందుకో మాత్రం ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే ఆదివారం సాయంత్రం కల్వకుంట్ల కవిత ఢిల్లీకి వెళ్ళారు. కవితతో పాటు మంత్రి కేటీయార్, ఎంపీ సంతోష్ తదితరులు వెంటవెళ్ళారు. ఇక్కడ రెండు విషయాలున్నాయి. మొదటిదేమో సోమవారం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు కవిత హాజరుకావాల్సుంది. ఇక రెండో కారణం ఏమిటంటే మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలోనే రౌండ్ టేబుల్ సమావేశం జరగబోతోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై సమావేశం అంటే కవితతో ఎవరూ వెళ్ళే అవసరం ఉండదు. ఎందుకంటే చాలా కాలంగా కవిత రెగ్యులర్ గా ఢిల్లీకి వెళుతున్నారు వస్తున్నారు. ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత సూత్రదారని ఈడీ అనుమానం వ్యక్తంచేసిందో అప్పటి నుండి కవిత కేంద్రంగా పార్టీలో హడావుడి బాగా పెరిగిపోతోంది. స్కామ్ విచారణలో భాగంగా ఆమధ్య కవితను తనింట్లోనే సీబీఐ విచారించింది. అప్పుడు కూడా మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు, నేతలు కవిత ఇంటిదగ్గర నానా గోలచేశారు.
ఈనెల 11వ తేదీన మొదటిసారి ఈడీ విచారణకు హాజరైనపుడు కూడా ఢిల్లీకి చాలామంది మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు, నేతలు వెళ్ళారు. అలాగే 16వ తేదీన రెండోసారి విచారణకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్ళినపుడు కూడా ఈడీ ఆఫీసు దగ్గర పెద్ద హంగామానే జరిగింది. అయితే కవిత విచారణకు హాజరుకాకుండా హైదరాబాద్ కు తిరిగొచ్చేయటంతో వీళ్ళు కూడా వచ్చేశారు.
ఇపుడు కవిత ఢిల్లీకి వెళ్ళినపుడు మళ్ళీ కేటీయార్, సంతోష్ వెళ్ళారు. వీళ్ళుకాకుండా మరికొంతమంది ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఎందుకు ఇంతమంది కవిత కోసం ఢిల్లీకి వెళుతున్నారో ఎవరికీ అంతుబట్టడంలేదు. ఇదే విషయమై పార్టీలోని మిత్రులను అడిగితే రాబోయే ఎన్నికల కోసమే ఇంత హడావుడి చేస్తున్నట్లు చెప్పారు. కేసీయార్ గుడ్ లుక్స్ లో పడి టికెట్లు దక్కించుకునేందుకే కవిత కోసం చాలామంది ఢిల్లీకి వెళుతున్నారట. ఈహడావుడంతా చూస్తుంటే మిత్రులు చెప్పింది నిజమేనేమో అనిపిస్తోంది.