కొన్నిసార్లు అన్ని ఇట్టే కుదిరిపోతాయి. కానీ.. మరికొన్నిసార్లు అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురవుతాయి. తాజాగా అలాంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత విషయంలో చోటు చేసుకుందని చెప్పాలి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట విరుపు గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏముంది? ఆయన నోరు విప్పి.. ఎవరినైనా టార్గెట్ చేయాలనుకోవాలే కానీ.. ఆయన ప్రతి మాట.. టార్గెట్ చేసిన వారికి కారం రాసినట్లుగా మారుతుంది. అలాంటిది.. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఆయన అన్ పార్లమెంటరీ పదాలు తన ప్రెస్ మీట్ లో ప్రస్తావించనప్పటికీ.. ఆయన మాట్లాడిన తీరుకు కవితకు కోపం రావటాన్ని అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమం వేళలోనూ.. ఆ తర్వాత తమను ఉద్దేశించి ఒక్క మాట అనటానికి కొమ్ములు తిరిగిన నేతలకు సైతం కిందా పడి.. మాట అనటానికి చానా ఇబ్బంది పడిన దానికి భిన్నంగా.. ఇటీవల కొంతకాలం నుంచి తమకు తోచినట్లుగా తిట్టేస్తున్న వైనం ఎక్కువైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తాను టార్గెట్ చేసిన వారిని ఉద్దేశించి ఎంత కటువుగా మాట్లాడతారోతెలిసిందే. తెలంగాణ రాష్ట్ర మంత్రి కమ్ కవిత సోదరుడు కేటీఆర్ సంగతే చూద్దాం. ఆయన కొంతకాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఎన్నేసి మాటలు అంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రి కేటీఆర్ కు.. ప్రధాని మోడీకి మధ్య వయసు వ్యత్యాసాన్ని.. స్థాయిని సైతం పట్టించుకోకుండా విరుచుకుపడుతున్న వేళ.. స్థాయిల గురించి కవిత లాంటి వారు మాట్లాడితే అస్సలు బాగోదని చెప్పాలి.
అయినప్పటికీ.. ఆడబిడ్డను ఉద్దేశించి అరవింద్ విమర్శలు చేయటాన్ని కొంతలో కొంత తప్పుగానే పరిగణించే వీలుంది. దీనికి ప్రతిగా.. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన కవిత.. నిజామాబాద్ బీజేపీ ఎంపీని ఉద్దేశించి.. తనను మరోసారి విమర్శలు చేస్తే ఊరుకోనని.. నిజామాబాద్ సెంటర్లో చెప్పుతో కొడతానని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కవితను ఉద్దేశించి అరవింద్ విమర్శలు చేయటాన్ని తట్టుకోలేని టీఆర్ఎస్ మద్దతుదారులు.. కవిత సానుభూతిపరులు చెలరేగిపోయి అర్వింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. కారును డ్యామేజ్ చేశారు.
ఇదంతా చూసినోళ్లు.. అర్వింద్ చేసిన అంత ఘాటు వ్యాఖ్య ఏమిటని చెక్ చేయటం మొదలు పెట్టారు. ఆ తర్వాత కవిత ఇచ్చిన వార్నింగ్ చేశారు. అర్వింద్ అన్న మాటలకు చెప్పుతో కడతానని కవిత అనటం.. ఫర్లేదని భావించినా.. దాడి కారణంగా అర్వింద్ మీద పెరగాల్సిన వ్యతిరేకత కాస్తా సానుభూతిగా మారిందన్న మాట వినిపిస్తోంది. అదేసమయంలో దాడి కారణంగా కవితకు రావాల్సిన సానుభూతి మైలేజీ మిస్ అయి అర్వింద్ ఖాతాలోకి పడినట్లుగా చెబుతున్నారు. వ్రతం చెడి కూడా ఫలితం దక్కనట్లుగా పరిస్థితి మారిందన్న మాట వినిపిస్తోంది.