ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవిత పేరు రావడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే కవితకు సిబిఐ అధికారులు సి ఆర్ పి సి 160 కింద నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కవితకు నోటీసులు ఇచ్చిన వైనంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు విమర్శలు గుప్పించారు.
కవిత కోరుకున్న చోట విచారణ చేస్తామని అధికారులు చెప్పడం అనుమానాలకు తావిస్తోందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 6న హైదరాబాద్లోనే తన నివాసంలో విచారణకు తాను సిద్ధమంటూ సిబిఐ అధికారులకు కవిత సమాచారం కూడా ఇచ్చారు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ హఠాత్తుగా తాను రేపు విచారణకు హాజరు కాలేనంటూ కవిత తాజాగా సిబిఐ అధికారులకు చెప్పిన విషయం తీవ్ర సంచలనం రేపుతుంది.
అంతకుముందు షెడ్యూల్ అయిన కార్యక్రమాల వల్ల తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానని, ఈ నెల 11 12 14 15 తేదీలలో తాను విచారణకు అందుబాటులో ఉంటానని సిబిఐకి కవిత లేఖ రాశారు. అయితే, ఈ కుంభకోణానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలో తన పేరు లేదని, విచారణకు సహకరించేందుకు తాను సిద్ధమని కవిత చెప్పారు. తాజాగా సిబిఐకి కవిత రాసిన లేఖపై విమర్శలు వస్తున్నాయి.
ముందుగా ఖరారైనన కార్యక్రమాల వివరాలు కవితకు తెలిసిన తర్వాతే ఆమె డిసెంబర్ 6న విచారణకు అంగీకరించారని, కానీ ఇప్పుడు కేసీఆర్ డైరెక్షన్ తోనే కవిత మాట మారుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎఫ్ఐఆర్ కాపీలో తన పేరు లేకపోవడంతో విచారణకు హాజరు కావడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.