బీఆర్ ఎస్ నాయకురాలు, మండలి సభ్యురాలు కవిత ను అరెస్టు చేసిన ఈడీ.. తాజాగా ఆమెను కోర్టు అనుమతితో 7 రోజుల పాటు కస్టడీకి కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది. ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలక వ్యక్తి అని ఈడీ పేర్కొంది.
సౌత్ లాబీ పేరుతో లిక్కర్ కేసులో ఆమె కీలకంగా వ్యవహరించారని ఈడీ తన రిపోర్టులో స్పష్టం చేసింది. ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వడంలో కవిత కీలక సూత్రధారి అని తెలిపింది. కవితకు బినామీగా రామచంద్రపిళ్లై వ్యవహరించి నట్లు పేర్కొంది. కవిత తన వ్యవహారం అంతా రామచంద్రపిళ్లై ద్వారా నడిపినట్లు పూస గుచ్చినట్టు ఈడీ వివరించింది.
వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ద్వారా కవిత ఢిల్లీకి రూ.30 కోట్లు తరలించారని రిపోర్టులో ఈడీ పేర్కొనడం గమనార్హం. రూ.30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకువెళ్లినట్లు పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అరుణ్ పిల్ళైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటాలను పొందినట్లు ఈడీ వివరించింది. ఇతరులతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల లంచం ఇచ్చినట్లు తెలిపింది.
కవిత తన మొబైల్ ఫోన్లోని ఆధారాలను తొలగించినట్లు ఈడీ పేర్కొనడం గమనార్హం. సౌత్ గ్రూప్‌లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవలతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కవిత కుట్రలు పన్నినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.
కవితకు రిలీఫ్..
ఈడీ కస్టడీకి ఏడు రోజులు అనుమతించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. ఇదే సమయంలో కవిత కోరికలు కూడా తీర్చింది. ప్రతిరోజు తన బంధువులను(భర్త, సోదరుడు, తల్లి) కలిసేందుకు అనుమతివ్వాలని కోరగా కోర్టు ఓకే చెప్పింది. ఇక, తన లాయర్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా కోర్టు అంగీకరించింది. పుస్తకాలు చదువుకునేందుకు, రాసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. ప్రతిరోజు ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి కూడా కోర్టు ఓకే చెప్పింది.