కశ్మీర్ ఫైల్స్ .. బాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ఒకటి. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను రూపొందిస్తే అది రూ.340 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. దీన్ని బట్టే ఈ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. కశ్మీర్లో హిందూ పండిట్ల మీద ముస్లిం ఛాందసవాదులు జరిని మారణ హోమం నేపథ్యంలో దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి హార్డ్ హిట్టింగ్ అనిపించేలా తీసిన ఈ సినిమా దేశంలో మెజారిటీ ప్రేక్షకులను మెప్పించింది. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం.. మౌత్ పబ్లిసిటీతో స్క్రీన్లు, షోలు పెంచుకుంటూ చాలా పెద్ద రేంజికి వెళ్లిపోయింది.
కొవిడ్ తర్వాత బాలీవుడ్‌కు గొప్ప ఊరటనిచ్చిన సినిమాల్లో ఇది ఒకటి. ఐతే కమర్షియల్‌గా అంత పెద్ద విజయం సాధించిన ఈ చిత్రానికి ఇప్పుడు అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (ఇఫీ)లో పరాభవం ఎదురైంది. ఈ సినిమాకు అక్కడ అవార్డులేమీ దక్కకపోగా.. జ్యూరీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మామూలుగా ఇలాంటి చిత్రోత్సవాల్లో మంచి సినిమాలకు వేదికల మీద ప్రశంసలు దక్కుతాయి తప్ప.. ఏ సినిమానూ ఓపెన్‌గా విమర్శించడం జరగదు. కానీ ‘కశ్మీర్ ఫైల్స్’ గురించి ఇఫీలో తీవ్ర విమర్శలే చేసింది జ్యూరీ. ఇలాంటి ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్లో ఇలాంటి సినిమాను ప్రదర్శించడమే పెద్ద తప్పు అన్నట్లుగా జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ ఫిలిం మేకర్ నాదవ్ లాపిడ్ వ్యాఖ్యానించాడు.
కశ్మీర్ ఫైల్స్‌ను ఉద్దేశించి ప్రాపగండా ఫిలిం, వల్గర్ మూవీ అనే తీవ్ర పదాలను ఆయన వాడడం.. కళాత్మక చిత్రాలు పోటీ పడే విభాగంలో ఈ సినిమాను పెట్టడం పెద్ద తప్పిదంగా పేర్కొనడం గమనార్హం. ‘కశ్మీర్ ఫైల్స్’ రిలీజైనపుడు కూడా ఒక వర్గం ఆ సినిమా గురించి ఇదే అభిప్రాయాలు వ్యక్తం చేసింది. కశ్మీర్ ముస్లింలు అందరూ మరీ రాక్షసులుగా ఇందులో చిత్రీకరించారని.. చరిత్రను వక్రీకరించారని ఆ వర్గం ఆరోపించింది. కానీ దేశంలో మెజారిటీ జనం ‘కశ్మీర్ ఫైల్స్’లో చూపించింది వాస్తవమని నమ్మి కశ్మీర్ పండిట్లకు బాసటగా నిలిచింది.